రూ. 950 కోట్ల తో ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ : మంత్రి కోమటిరెడ్డి. మధుయాష్కి, మల్రెడ్డి రాంరెడ్డి తో కలిసి హయత్ నగర్ లో రూ. 10 కోట్ల తో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన
ఎల్ బి నగర్ మార్చి 14:ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు రూ. 950 కోట్ల వ్యయంతో డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నామని, త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించనుందని రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. హయత్ నగర్ లోని సాయిబాబా గుడి చౌరస్తా నుంచి జి స్కూల్ వరకు రూ. 10 కోట్ల తో చేపట్టనున్నపాత నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి తో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. మెట్రో రైల్ తో కూడిన డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కేంద్ర మంత్రి గడ్కరీని పలుమార్లు కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో పూర్తి స్థానికులు తెలిపారని, రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.200 కోట్లను ముందస్తుగా చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి ఢిల్లీకి వెళ్లి మెట్రో తో డబుల్ డెక్కర్ రోడ్డును సాంక్షన్ చేయించుకొని వస్తామని తెలిపారు. రెండు నెలల్లో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. రోడ్ల విస్తరణ కోసం ఆర్ అండ్ బి తరపున ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లోనే రూ. 400 కోట్ల నిధులను మంజూరు చేశామని పేర్కొన్నారు. హయత్ నగర్ నుంచి తారామతి పేట్ వరకు, కోహెడ ఫ్రూట్ మార్కెట్ రోడ్డు, ఇంజాపూర్ రోడ్డు తదితర రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి విస్తరణను కూడా ఎంపీగా ఉన్నప్పటి నుంచి పోరాడిమంజూరు చేయించానని పేర్కొన్నారు. ప్రస్తుతం రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని.. అంతేకాకుండా రూ. 10 వేల కోట్లతో విజయవాడ వరకు సర్వీస్ రోడ్ల ను కూడా అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, ఉచిత బస్సు, ఉచిత కరెంటు, రేషన్ కార్డుల పంపిణీ తదితర సంక్షేమ పథకాలతో పేదల ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. కాలుష్యం బారిన పడిన మూసీని పునరుజ్జీవం చేపట్టడం ఆవశ్యకమని.. ఇల్లు కోల్పోయే వారికి ఎక్కడికక్కడ పునరావాసం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో బస్సు చార్జీలు కూడా లేని ఆ పార్టీ నాయకులు.. అవినీతితో వేలకోట్ల ఎదిగారని విమర్శించారు.ఉమ్మడి ఏపీలో నిధులన్నీ ఆంద్రాకే తరలించే వారన్నారు. తెలంగాణ కోసం మధు యాష్కి,తాను సోనియాగాంధీకి వివరించి ఒప్పించామన్నారు. తెలంగాణ ఉద్యమంలో.. అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డిని సైతం ఎదిరించి రాష్ట్ర ఏర్పాటు కోసం మధుయాష్కి పోరాడారని మంత్రి వెంకట రెడ్డి గుర్తు చేశారు. మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ.. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు డబల్ డెక్కర్ రోడ్డు ఏర్పాటు కోసం మంత్రి వెంకట్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని,కేంద్రమంత్రి గడ్కరి తో వ్యక్తిగత అనుబంధంతో రోడ్డు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. హయత్ నగర్ వద్ద పాత హైవే తో పాటు బాతుల చెరువు నుంచి ఇంజాపూర్ వైపు కూడా రోడ్డును విస్తరించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు.మూసీ పునర్జీవం పై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణను తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మూసీ పరివాహ ప్రాంతం లో గృహపకరణాలు, ఆభరణాలు పాడవుతున్న తీరు చూస్తుంటే కాలుష్య తీవ్రత ఎంత ఉందో తెలుస్తుందన్నారు. గతంలో మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏమి అభివృద్ధి చేశాడని, ఎన్ని నిధులు తీసుకొచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా పనిచేసిన ఎల్బీనగర్ పై ప్రత్యేక అభిమానం ఉందని, అభివృద్ధి కోసం అత్యధిక నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఉద్యమంలో తన పదవిని సైతం లెక్కచేయకుండా పోరాడారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మల్ రెడ్డి రామ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు డబల్ డెక్కర్ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే ట్రాఫిక్ సమస్య ఎంతో తీరుతుందని పేర్కొన్నారు. పాత హైవేను జి స్కూల్ వరకే కాకుండా రేడియో స్టేషన్ వరకు విస్తరించాలని మంత్రి ని కోరారు. రోడ్డు విస్తరణ సందర్భంగా ఇల్లు కోల్పోతున్న వారికి న్యాయం చేయాలని, టిడిఆర్ ఇవ్వాలని కోరారు. ఎల్బీనగర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంత్రి వెంక రెడ్డి వందల కోట్ల నిధులను కేటాయించడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కాగా రైల్వే స్టేషన్ వరకు రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రిగారు ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ఎండ్బీ శాఖ ఈఎన్సీ మోహన్ నాయక్, నేషనల్ హైవే సీఈ ధర్మా రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, దేవాలయ కమిటీల ధర్మకర్తలు, సేవాదళ్, , మహిళా నాయకురాళ్లు, యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ, ఎస్సీ ఎస్టీ, బీసీ,మైనారిటీ, తదితర విభాగాల ప్రతినిధులు కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.