మూసీ పునరుజ్జీవనంపై ఎంఆర్డీసీఎల్ ప్రజెంటేషన్: ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ మార్చి 13:హైదరాబాద్ నగర అభివృద్ధికి అత్యంత కీలకమైన మూసీ నది పునరుజ్జీవనం, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ తొలి దశలో చేపట్టనున్న ప్రాజెక్టులపై ఎంఆర్డీసీఎల్ (MRDCL) అధికారులు సమగ్ర ప్రజెంటేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పాల్గొన్నారు.
సమావేశానికి పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, మేధావులు, పర్యావరణ నిపుణులు, అర్బన్ ప్లానర్లు, ఆర్కిటెక్టులు, వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా మూసీ నది పునరుజ్జీవనం, రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదిత ప్రణాళికలను ప్రభుత్వం ఆవిష్కరించింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు లక్ష్యాలు, అమలు విధానం, చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు వివరించారు.
మూసీ నది శుద్ధీకరణ, నగరానికి స్వచ్ఛమైన నీటి సరఫరా, పర్యావరణ పరిరక్షణ, నది తీరాల అభివృద్ధి, ప్రజలకు అవసరమైన ఆధునిక మౌలిక వసతుల ఏర్పాటు వంటి అంశాలను ఈ ప్రాజెక్టులో భాగంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో తొలి దశలో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమావేశంలో వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మూసీ నది పరిసర ప్రాంతాల అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.