ప్రజల కష్టాలపై కేంద్రం మౌనం సరైంది కాదు – పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మార్చి 11 న్యూ డిల్లీ: దేశంలో పెరుగుతున్న ఎల్పీజీ సమస్యలు, పరిశ్రమల మందగమనం మరియు సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. ప్రజల అసలు పరిస్థితిని గుర్తించి వారికి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పటికే మందగమనంలోకి వెళ్లిందని, టెక్స్టైల్ రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని తెలిపారు. హోటల్ మరియు రెస్టారెంట్ రంగం కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి కొనసాగితే వేలాది మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
ప్రస్తుతం Zomato, Zepto వంటి యాప్‌ల ద్వారా పనిచేస్తున్న గిగ్ వర్కర్ల భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఎంపీ వంశీ కృష్ణ పేర్కొన్నారు. రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడితే ఈ రంగంలో పనిచేసే యువతకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని ఆయన అన్నారు.
బీజేపీ నాయకులు దేశంలో ఎల్పీజీ లేదా ఎల్ఎన్జీ కొరత లేదని చెబుతున్నారని, అయితే సమస్యలు లేకపోతే సామాన్య ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారో చెప్పాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నించారు. ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం బాధాకరమని అన్నారు.
దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో బంగ్లాదేశ్‌కు 5000 టన్నుల డీజిల్ సరఫరా చేయడం ఎందుకు అవసరమైందో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ ప్రజల అవసరాలు ముందుగా తీర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు.
గత సంవత్సరం యూరియా సరఫరాలో జరిగిన గందరగోళం వల్ల రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారని, ముఖ్యంగా తెలంగాణ రైతులు కూడా ఇబ్బందులు పడ్డారని ఎంపీ వంశీ కృష్ణ గుర్తు చేశారు. ప్రస్తుతం ఎల్పీజీ, ఎల్ఎన్జీ సమస్యలు కొనసాగితే యూరియా కొరత కూడా ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణతో పాటు దేశ ఆర్థిక పరిస్థితిపై తీసుకునే చర్యలను ప్రజలకు వివరించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకుని సమస్యలకు పరిష్కారం చూపాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.