తిరుమలలో అదుపు తప్పుతున్న ధరలు – భక్తులపై భారం. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు భక్తులు
తిరుమల, మార్చి 15: తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తుల నుంచి తిరుమలలో కొందరు దుకాణదారులు అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీ దుకాణాల్లో ఒక్క కప్పు టీపై ఒక్క రోజులోనే మూడు రూపాయలు పెంచి భక్తుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నట్లు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ధరలు ఎందుకు పెంచారని ప్రశ్నించిన భక్తులకు “గ్యాస్ ధరలు పెరిగాయి” అంటూ దుకాణదారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని తెలిపారు. ఇప్పటికే దర్శనం, వసతి, ఆహారం వంటి విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భక్తులకు ఈ విధంగా అధిక ధరలు వసూలు చేయడం మరింత భారంగా మారిందని అంటున్నారు.ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు వచ్చే తిరుమలలో ధరలను నియంత్రించే బాధ్యత కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ విషయంపై వెంటనే స్పందించి, అధిక ధరలు వసూలు చేస్తున్న దుకాణదారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.