యుద్ధాల్లో బలి అవుతున్న బాల్యం.__ వ్యాసకర్త : డా|| కె.రమాప్రభ
Oplus_131072
మార్చి 20 హైదరాబాద్:ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా మొదటగా నశించేది మానవత్వం, ఎక్కువగా నష్టపోయేది బాల్యం. బాంబులు పడుతున్నప్పుడు కూలిపోతున్నది కేవలం భవనాలు కాదు. వేలాది బాలల కలలు, భవిష్యత్తు కూడా. ఉక్రెయిన్, గాజా, ఇరాన్ వంటి ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు లక్షలాది పిల్లలను అనాథలుగా, శరణార్థులుగా మార్చుతున్నాయి. చదువు, ఆరోగ్యం, భద్రత వంటి ప్రాథమిక హక్కులు కూడా వారికి అందకుండా పోతున్నాయి. బాలలు యుద్ధాలకు కారణం కాకపోయినా, ప్రతి యుద్ధంలో అత్యధికంగా బాధపడుతున్నవారు వారే. అందుకే బాలల హక్కులను కాపాడటం అంటే యుద్ధాలను ఆపడం, శాంతిని కాపాడటం.
“యుద్ధాల వెనుక అసలు కారణాలు”
ప్రపంచంలో ఎక్కువ యుద్ధాలు ప్రధానంగా నాలుగు అంశాల కోసం జరుగుతున్నాయి. మొదటిది రాజకీయ అధికారం. కొంతమంది నాయకులు ‘విదేశీ శత్రువు’ అనే బూచిని సృష్టించి జాతీయతను రెచ్చగొట్టి తమ అధికారాన్ని పటిష్టపరుచుకుంటారు. రెండవది ఆయుధ వ్యాపారం. ఆయుధ తయారీ సంస్థలు ప్రపంచంలో అత్యధిక లాభాలను పొందే రంగాల్లో ఒకటి. యుద్ధం మొదలైతే కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతుంది. మూడవది సహజ వనరులపై ఆధిపత్యం. చమురు, గ్యాస్, ఖనిజాలు, నీరు వంటి వనరుల కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. నాలుగవది మతం లేదా జాతీయత. ఇవి చాలాసార్లు నిజమైన కారణాలు కాకుండా ప్రజలను యుద్ధానికి ప్రేరేపించే ఒక ముసుగుగా ఉపయోగపడతాయి. ఈ నాలుగు కారణాల్లో ఒక్కటి కూడా సాధారణ ప్రజల ప్రయోజనం కోసం కాదు. లాభం కొద్ది మందికి, నష్టం కోట్లాది మందికి.
మొదట బలయ్యేది బాలలే
ఆధునిక యుద్ధాల్లో మరణించే వారిలో ఎక్కువ మంది సైనికులు కాదు, సాధారణ ప్రజలు. అందులో పెద్ద భాగం బాలలే. అంతర్జాతీయ సంస్థల నివేదికల ప్రకారం ఆధునిక యుద్ధాల్లో సుమారు 90 శాతం మరణాలు సాధారణ ప్రజలవే. బాలలను కోల్పోతే మనం మన భవిష్యత్తును కోల్పోతున్నాం. ఎవరి లాభంకోసమైనా బాలల రక్తాన్ని ఖర్చు చేయడం మానవత్వానికే మచ్చ.
బాలలు యుద్ధాలకు కారణం కాదు.
కానీ ప్రతి యుద్ధంలో పెద్ద సంఖ్యలో బాధితులు వారే.
ఉక్రెయిన్ యుద్ధం – బాలల జీవితాలపై ప్రభావం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగేళ్లుగా కొనసాగుతోంది. దీని ప్రభావం లక్షలాది కుటుంబాలపై పడింది. నివేదికల ప్రకారం 2022 నుంచి కనీసం 3200 మంది బాలలు చనిపోయారు లేదా గాయపడ్డారు. ఒక్క 2025లోనే 92 మంది బాలలు మరణించగా, 652 మంది గాయపడ్డారు. దేశంలోని మూడింట ఒక వంతు బాలలు మానసిక గాయాలకు గురయ్యారు. పాఠశాలలు ధ్వంసం కావడం, విద్యుత్ సౌకర్యాలపై దాడులు జరగడం వల్ల పిల్లలు చదువు, ఆరోగ్య సేవలు కోల్పోతున్నారు. చాలామంది శరణార్థులుగా మారిపోయారు.
గాజా యుద్ధం – ఒక తరం నాశనం
2023 అక్టోబర్ నుంచి కొనసాగుతున్న గాజా యుద్ధం బాలలపై అత్యంత దారుణ ప్రభావం చూపింది. నివేదికల ప్రకారం 21 వేలకు పైగా బాలలు చనిపోయారు. 44 వేలకుపైగా బాలలు గాయపడ్డారు. వారిలో వేలాది మంది శాశ్వత వికలాంగులయ్యారు. 56 వేలకుపైగా బాలలు తమ తల్లిదండ్రులను కోల్పోయారు. పాఠశాలలు, ఆసుపత్రులు ధ్వంసమయ్యాయి. ఆహారం లేక వేలాది బాలలు ఆకలి చావు అంచున ఉన్నారు. ఈ యుద్ధం వేలాది బాలలను అనాథలుగా, భయంతో జీవించేలా చేసింది.
ప్రతి బాంబు వెనుక కనీసం ఒక బాలుడి/బాలిక
కల చనిపోతున్నది.
ఇరాన్ యుద్ధం – పాఠశాలలపై దాడులు
ఫిబ్రవరి 2026 లో ప్రారంభమైన ఇరాన్ యుద్ధం కూడా బాలలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రారంభ దాడుల్లోనే 180 నుండి 200 మంది బాలలు మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఒక పాఠశాలపై జరిగిన దాడిలో 168 మంది బాలికలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పలు పాఠశాలలు, ఆసుపత్రులు ధ్వంసమయ్యాయి. విద్య, ఆరోగ్య సేవలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
బాలలపై జరుగుతున్న ఆరు తీవ్రమైన ఉల్లంఘనలు
ప్రపంచ సంఘర్షణల్లో బాలలపై ఆరు ప్రధాన ఉల్లంఘనలు జరుగుతున్నాయి. బాలలను చంపడం లేదా గాయపరచడం. బాలలను సైనికులుగా ఉపయోగించడం. పాఠశాలలు, ఆసుపత్రులపై దాడులు. లైంగిక హింస, బాలల అపహరణ. మానవతా సహాయాన్ని నిరాకరించడం. ఇవి అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకం అయినప్పటికీ యుద్ధాల్లో కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సంక్షోభం
ప్రపంచంలో కోట్లాది బాలలు యుద్ధ ప్రభావంలో జీవిస్తున్నారు. నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 47.3 కోట్ల బాలలు ఘర్షణాత్మక ప్రాంతాల్లో జీవిస్తున్నారు. ప్రతి రోజూ సగటున 23 మంది బాలలు బాంబు దాడుల్లో గాయపడుతున్నారు. లేదా చనిపోతున్నారు. పాఠశాలలపై దాడులు గణనీయంగా పెరిగాయి. లక్షలాది బాలలు స్కూల్‌కు వెళ్లలేకపోతున్నారు. కోట్లాది బాలలు శరణార్థులుగా మారిపోయారు. యుద్ధం వారి జీవితాలను శాశ్వతంగా మార్చేస్తోంది.
యుద్ధాలు దేశాలను గెలిపించవచ్చు,
కానీ బాల్యాన్ని ఎప్పుడూ ఓడిస్తాయి.
శాంతి – సమాజం బాధ్యత
యుద్ధం ఎప్పుడూ సమస్యకు పరిష్కారం కాదు. దేశాలు సంభాషణలు, చర్చలు, డిప్లమసీకి ప్రాధాన్యత ఇవ్వాలి. అంతర్జాతీయ చట్టాలను బలోపేతం చేయాలి. ఆయుధ వ్యాపారంపై నియంత్రణ ఉండాలి. నాయకుల జవాబుదారీతనం పెరగాలి. ప్రజలు కూడా యుద్ధాలకు వ్యతిరేకంగా శాంతి కోసం గొంతెత్తాలి.
బాలలు – శాంతి దూతలు
బాలలు యుద్ధాలకు కారణం కాదు. కానీ వారు బాధితులు. అందువల్ల వారిని ”బలి”గా కాదు, ”శాంతి దూతలు”గా చూడాలి. పాఠశాలలు, బాలల క్లబ్బులు, లైబ్రరీల్లో శాంతి కోసం డ్రాయింగ్ కార్యక్రమాలు, కథలు, నాటికలు, కళా ప్రదర్శనలు నిర్వహించాలి. సోషల్ మీడియాలో శాంతి సందేశాన్ని విస్తరించాలి.
బాలల రక్తంతో లభించే ఎలాంటి
విజయమైనా అన్యాయమైనదే.
యుద్ధాలు ఎప్పుడూ శాంతిని తీసుకురావు. అవి కేవలం మరిన్ని కన్నీళ్లు, మరిన్ని చావులు, మరిన్ని అనాథలను మాత్రమే సృష్టిస్తాయి. బాంబు పడిన ప్రతిసారీ చిన్నారుల కలలు చనిపోతాయి. ప్రతి యుద్ధం ఒక తరం భవిష్యత్తును నాశనం చేస్తుంది. బాలలు చదువుకోవాలి, ఆడుకోవాలి, కలలు కనాలి. కానీ యుద్ధం వారిని భయం, ఆకలి, నిరాశల మధ్య బతికేలా చేస్తోంది. ప్రపంచం ఇప్పుడు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. బాలల రక్షణ ముందా? యుద్ధాల రాజకీయ ప్రయోజనాలా? నిర్ణయించుకోవాలి.
ఒక చిన్నారి చనిపోతే…ఒక కుటుంబం మాత్రమే కాదు.
ఒక సమాజం నష్టపోతుంది.
బాలల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. కాబట్టి యుద్ధాలను వ్యతిరేకించాలి. యుద్ధాలు ఆపాలి. శాంతిని కాపాడాలి. బాలల హక్కులను రక్షించాలి. బాలల రక్షణ అంటే మానవత్వ సంరక్షణ.
వ్యాసకర్త : డా|| కె.రమాప్రభ
సెల్: 9492348428