April 18, 2026

ప్రజా సేవలో భాగస్వామ్యం.. భగవంతుడిచ్చిన వరం!ప్రజల దీవెనలతోనే ఈ స్థాయికి చేరుకున్నాంనిధుల వినియోగంలో నూతన ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

0
IMG-20260312-WA2183

మార్చి 12 ఖమ్మం: “రాజకీయాల్లోకి మనం వచ్చింది కేవలం ప్రజా సేవ కోసమే. ఐదేళ్ల తర్వాత మనం పదవి నుంచి దిగిపోయేటప్పుడు.. మన గ్రామం, మన వార్డు ఎంతో అభివృద్ధి చెందిందని ప్రజలు మనల్ని మనస్ఫూర్తిగా అభినందించాలి. ఆ ఆత్మీయతే మనం సంపాదించుకునే అసలైన ఆస్తి” అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు పేర్కొన్నారు. గురువారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గ్రామ పంచాయతీల బలోపేతం కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. “గడిచిన కొద్ది రోజుల్లోనే పంచాయతీల ఖాతాల్లోకి గణనీయంగా నిధులు జమ అయ్యాయి. మార్చి ఆఖరు నాటికి మరిన్ని నిధులు రాబోతున్నాయి. ఈ నిధులను ఒక ప్రణాళికాబద్ధంగా, ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం వినియోగించాలి. మన సొంత డబ్బును ఎంత జాగ్రత్తగా వాడుకుంటామో.. ప్రజా ధనాన్ని కూడా అంతే బాధ్యతగా కాపాడుతూ అభివృద్ధి పనులు చేపట్టాలి” అని సర్పంచులకు సూచించారు.

అభివృద్ధి పనుల నిర్వహణలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి కోరారు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కల్పనలో చిన్నపాటి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయని వివరించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.

“ఎన్నికల వరకే రాజకీయాలు.. గెలిచిన తర్వాత మనమంతా ప్రజల సేవకులం. పార్టీలకతీతంగా ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలి” అని మంత్రి పిలుపునిచ్చారు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులకు అధికారులు పూర్తి స్థాయిలో మార్గనిర్దేశం చేస్తూ, వారిని ప్రోత్సహించాలని ఈ వేదిక ద్వారా కోరారు. ప్రభుత్వం చేపట్టిన ఈ 99 రోజుల ప్రణాళికలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed