కనుమ చాలా గొప్ప పండుగ. తెలుసుకుందాము కనుమ పండుగ గురించి కొన్ని విషయాలు
Oplus_131072
జనవరి 16 హైదరాబాద్ :ఆత్మీయ అనుబంధాల పల్లెలోగిళ్లలో నిజమైన సంక్రాంతి పండుగ శోభ కనుమ పండుగనాడు కానవస్తుంది. రైతుతో పాటు ఆరుగాలం శ్రమించే బసవన్నలకు అలంకరణలతో ప్రత్యేక పూజలు జరుగుతాయి. మానవ మనుగడకు సహకరించే పశుపక్ష్యాదులకు కృతజ్ఞతలు చెల్లించుకునే మహత్తర పర్వం కనుమ. సంక్రాంతి పండుగలో మూడో రోజు కనుమ పండుగ. ప్రకృతిని దైవంగా భావించి పూజించే కనుమ పండుగ ప్రధానంగా కర్షకుల పండుగ. మూడు రోజుల సంక్రాంతి పండుగలో భాగంగా మూడో రోజున కనుమ పండుగగా, నాలుగో రోజును ముక్కనుమగా జరుపుకుంటారు. కనుమ పండుగ ముఖ్యంగా కర్షకుల పండుగ. ఈ రోజున పాడి పంటలను, పశుసంపదను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. కనుమ పండుగ రోజు కొన్ని సంప్రదాయాలు తప్పకుండా పాటిస్తారు. కనుమ పండుగ రోజున తలంటు స్నానం చేయాలి. కనుమ రోజున కాకి కూడా మునుగుతుందంటారు. కనుక ఈ రోజున తలంటుస్నానం చేయాలి. ఇంటి ఆడపడుచులకు పసుపుకుంకుమలు ఇచ్చి పుచ్చుకుంటారు. అంతేకాదు కనుమ రోజున మినుములు తినాలన్నది పెద్దలు చెప్పే మాట. అంటే మినపప్పుతో చేసిన గారెలు వంటివి తినాలి. ఆయుర్వేదం ప్రకారం మినుములు శరీరంలో వేడిని పుట్టిస్తాయి. శీతాకాలంలో మినప గారెలు తినడం ఆరోగ్యానికి మంచిది.
కనుమ పండుగ రోజున సంవత్సరమంతా రైతులకు చేదోడువాదోడుగా ఉండే పశువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాటిని శుభ్రంగా కడిగి వాటిని అలంకరించి, పూజిస్తారు. పశువుల కొమ్ములకు రంగులు వేసి, వాటి మెడలో రంగురంగుల పూసలు, గంటలు కట్టి అలంకరిస్తారు. రైతులు తమ పొలంలోనే పొంగళ్లు వండి భూలక్ష్మికి నివేదన చేసిన తరువాత ఆ పొంగళ్లను తమ పంట పొలంలో చల్లుతారు. అలా చేయడం వలన పంటలు సమృద్ధిగా పండుతాయన్నది విశ్వాసం. కనుమ రోజు కొన్ని ప్రాంతాలలో దేవాలయాలలోని ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా సమీపంలోని తోటలలోనికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా నెల్లూరు వంటి ప్రాంతాలలోనూ, కోనసీమలోనూ ఈ వేడుక ఎంతో వైభవంగా జరుగుతుంది.