April 17, 2026

ఓ సభ్య సమాజమా సిగ్గుపడు…!ఆధునిక యుగంలో కూడా ఇంకా కులం, మతం పేరున వివక్ష ఇంకెన్నాళ్లు కొనసాగుతుంది…?తల్లి ఒడిలో సేద తీరాల్సిన రెండు నెలల పసిబిడ్డ మట్టి కింద నిదరబోతుందా…! డాక్టర్ కృష్ణ బంటు, సీనియర్ ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్, హ్యూమనిస్ట్

0
IMG_20260226_095501

ఫిబ్రవరి 26 హైదరాబాద్: మనుషుల్లో విజ్ఞానం పెరిగే కొద్దీ ఇంగిత జ్ఞానం తగ్గిపోతుంది. మనిషికి ఉండే మంచితత్వం, మనిషి తత్వం, మంచి వ్యక్తిత్వం కలగలిపి ఉండాల్సిన మానవత్వం మరుగున పడుతుంది, రోజురోజుకు తరిగిపోతుంది, మానవుల్లో కనిపించకుండా పోతుంది, కనుమరుగవుతుంది. చదువుకుని ఆధునిక మానవుని లాగా ప్రవర్తించాల్సిన మనిషి అనాగరికనుగా క్రూరంగా ప్రవర్తిస్తూ తిరిగి తీసుకురాలేని విలువైన ప్రాణాలను చాలా ఈజీగా తీసేస్తున్నారు. అది కూడా కులాలకు, మతాలకు అతీతంగా జరుపుకోవాలిసిన పండుగలు, జాతరలు కులమత విద్వేషాలకు నిలయంగా మారుతున్నాయి. కులం, మతం, దేవుడు, దయ్యం అనే కనిపించని, వినిపించని అజ్ఞాన అంధకారాలమాటున అభం, శుభం తెలియని అమాయక చిన్నారుల ప్రాణాలను కొందరు కులమత అహంకారంతో మేమే సర్వస్వం అని గర్వంతో విర్రవీగే వారి విచ్చుకత్తులకు చిచ్చు పెడుతూ జీవితాలను బలి తీసుకుంటున్నాయి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచానికి ఆదర్శంగా ఒక గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించినప్పటికీ పూర్తిగా అమలు చేయకుండా కొందరు పాలకులు తమ సొంత రాజ్యాంగాలను అమలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో, రాజ్యాంగ పీఠికలో చెప్పినట్టు స్వేచ్ఛ, సమానత్వము, సౌబ్రాతృత్వము, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయము, వ్యక్తిగత గౌరవము, దేశ సమైక్యత ఇలాంటి గొప్ప గొప్ప పదాలన్నీ కేవలం రాజ్యాంగం లోనే రాసుకుంటానికి, చదువుకోవడానికి తప్పించి వాటిని తప్పకుండా అమలు చేసే వారు లేరా. ఏ పండుగ అయినా ఏ జాతరైనా మనుషులని కలపాలి తప్పించి విడగొట్టడానికి కాదు కదా. విషాదం నింపడానికి అంతకన్నా కాదు కదా. సంతోషంతో, ఆనందంతో కేరింతలు కొడుతూ ఆడుకునే చిన్నారుల పాలిట కసాయిలాగా ప్రవర్తించి కాలితో తన్ని చావుకు కారకులైన వారి పైన ప్రభుత్వం కేసులు పెట్టొచ్చు, అరెస్టు చేయొచ్చు, చట్టం తన పని తాను చేసుకోపోవచ్చు, జిల్లా కలెక్టర్ నివేదిక కోరవచ్చు, బీసీ కమిషన్ హారతియవచ్చు ఆరా తీయవచ్చు, ఇంకా ఈ సంఘటనపై పూర్తి విచారణ అధికారులు కొనసాగించవచ్చు, ఆయా ప్రజా సంఘాలు న్యాయం కోసం ఆందోళన చేపట్టవచ్చు, కానీ ఎవరైనా ఇలాంటి సంఘటనలు మళ్లీమళ్లీ పునరావృతం కావు అని గుండె మీద చేయి వేసుకొని చెప్పగలరా అని సమాజం ప్రశ్నిస్తుంది. ఇలాంటి దురదృష్టకర, కుట్ర పూరిత, హింస పూరిత, విషపు పూరిత సంఘటనలు, కుల మత ఘర్షణలు, వివక్ష, విధ్వంసాలు మళ్లీ ఎక్కడో ఒక చోట, ఎక్కడో ఒక సారి కులం, మతం తన ప్రతాపాన్ని చూపెట్టక మానదు కదా.ఇలాంటి వాటికి అంతం ఎప్పుడు అని సమాజం నిలబెట్టి, నిగ్గదీసి అడుగుతుంది. అందుకే ఓ సమాజమా సిగ్గుపడు…ఇలాంటి కుల, మత దురహంకార హత్యలకు నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతర వేదిక అయింది.

ఒక్క తెలంగాణ లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కుల, మత వివక్ష దాడులు

కులమత వివక్ష దాడులు, దౌర్జన్యాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను ఎప్పుడో ఒకసారి ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. సంఘటన జరిగిన మొదట్లో ఉన్న వేడి రాను రాను సన్నగిల్లుతుంది ఆవేదన, ఆగ్రహం తగ్గిపోతూ చివరికి మౌనంగా మారుతుంది. ఇలాంటి అమానుష దాడులు జరిగి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ప్రాణాలు కోల్పోయినప్పుడల్లా మనం ఇది చివరిసారి అయితే బాగుండు అనుకుంటున్నాం కానీ నిజంగా ఆ విధంగా జరుగుతుందా మళ్లీ ఎక్కడో చోట పునరావృతం అవుతూనే ఉంది. హర్యానా రాష్ట్రంలో గతంలో దళిత కుటుంబం పై దాడి జరిగిన సంఘటనలో వికలాంగ యువతి, ఆమె తండ్రి మృతి చెందారు. గ్రామంలో ఉన్న కుల వైరం కారణంగానే ఈ దాడి జరగడంతో జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. తమిళనాడులో కూడా అంతర్జాతీ వివాహం కారణంగా దళితుల ఇండ్లు కూడా తగలబెట్టారు. కేవలం కుల వివక్ష కారణంగా ఈ సంఘటన జరిగింది. గుజరాత్ రాష్ట్రంలో ప్రజల ముందు దళిత యువకులను కొట్టిన వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళిత యువత పై దాడి చేయడంతో దళితులు మరణిస్తే దేశవ్యాప్తంగా ఆందోళనకు దారి తీసింది. ఈసారి కూడా మళ్లీ కుల విభక్షం తీవ్రంగా చర్చకు వచ్చింది. ఇంకా దేశవ్యాప్తంగా వెలుగులోకి రాని సంఘటనలు ఎన్నో, ఎన్నెన్నో.

ప్రతివారు మనసుపెట్టి ఆలోచించాలి మనిషిని మనిషిగా చూసే సమానత్వ సమాజం కోసం కృషి చేయాలి

ఒకరి ప్రాణాలను తీయాలంటే వారిని కన్నవారికే హక్కు ఉండదు. అలాంటిది ఒక అభం శుభం తెలియని రెండు నెలల చిన్న పాపను కాలితో బలంగా తన్నడం వల్ల దూరంగా విసిరి వేయబడి ఈనెల 18వ తారీకు నుంచి చికిత్స పొందుతూ ఫిబ్రవరి 21న చిన్నారి మరణించింది. అప్పటినుండి ప్రజా సంఘాలు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం కూడా దిగి వచ్చింది. బాధ్యులపై పోలీసులు సందేహాస్పద మృతి, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసులు కూడా నమోదు చేశారు. అయితే కేసులు, చట్టము తర్వాత, కానీ ప్రతివారికి మనస్సాక్షి ఉంటుంది కదా. తోటి వారిని, సాటివారిని కూడా మనుషులే అన్న జ్ఞానం కూడా ఉంటుంది కదా. సమాజంలో ఒకరు గొప్ప, ఒకరు తక్కువ,ఒకరు ఎక్కువ అనే వివక్ష ఎందుకు వస్తుంది. కొందరు జంతువుల కంటే హీనంగా మనుషులను చూసే సూపు ఎంత దురదృష్టకరం, ఎంత అవమానకరం, ఎంత అవహేళనకరం, ఎంత జుగుప్సాకరం, ప్రకృతిలో ఏ చెట్టుకు, పుట్టకు, ఏ ప్రాణికి లేని కుల, మత అంతరాల దొంతరలు కేవలం చదువుకున్నాం, డబ్బు ఎక్కువ ఉంది, మేము ధనవంతులం కాబట్టి మాకు గర్వం ఉంటుంది,మా కులం గొప్పది, మా మతం గొప్పది అన్న తేడాలు మనుషులకు మాత్రమే ఎందుకు ఉన్నాయో. ఆలోచనాశక్తి, పరిశీలన, పర్యవేక్షణ, పరిశోధన పటిమ, తార్కిక జ్ఞానం, గొప్ప తాత్వికత మనుషులైన ప్రతివారికి ఉంటుంది కదా. అలాంటప్పుడు ప్రతి వారు కూడా ఒకరిని ఎందుకు కులం, మతం పేరున దూషించి దూరంగా పెట్టడం అనే ఒక మంచి భావనను పెంపొందించుకొని అందరూ బంధువుల వలే, మిత్రులవలే,సోదర భావంతో విశ్వ మానవ సమానత్వ సౌబ్రాతృత్వంతో విలసిల్లి ఒక గొప్ప భారతావని నిర్మించాల్సింది పోయి, అక్కరకు రాని,అవసరం లేని కులంతో, మతంతో మేమే గొప్ప వారం అనే ఒక విర్రవీగే తత్వాన్ని విడిచి పెట్టాలని, మనిషిని మనిషిగా చూసి సమాజం రావాలని ప్రతివారు కోరుకోవాలని, ప్రతి మనిషిలోమార్పు అనేది తప్పకుండా రావాలని మనమూ ఆశిద్దాం. అసలైన మానవత్వమే మనిషి తత్వం కావాలి. మనిషిగా బతుకుదాం, మానవత్వంతో జీవిద్దాం, తోటి వారిని గౌరవిద్దాం, మన గౌరవాన్ని కాపాడుకుందాం. వివక్ష పేరున ఎవరిని హింస పెట్టవద్దు,కక్షలు పెంచుకోవద్దు. భారతదేశమంటేనే విశ్వ మానవ సమానత్వ భావన వెల్లివిరిసేలా ప్రతివారు కృషి చేయాలని కోరుకుందాం.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed