April 18, 2026

వెలుగుమట్ల భూదాన్ భూమి బాధితులకు తక్షణ న్యాయం చేయాలి:జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం

0
IMG-20260311-WA1725

ఖమ్మం, మార్చి 11: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూదాన్ భూముల సమస్యతో ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు తక్షణ న్యాయం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. భూదాన్ భూమి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మూడో రోజు కొనసాగుతున్న నిరవధిక నిరాహార దీక్షలో పాల్గొంటున్న కల్వకుంట్ల కవిత గారికి సంఘీభావం తెలుపుతూ ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ, ఖమ్మం పట్టణానికి సమీపంలోని వెలుగుమట్ల ప్రాంతంలో ఉన్న భూదాన్ భూముల్లో సుమారు 600 కుటుంబాలు సంవత్సరాలుగా నివసిస్తూ తమ కష్టార్జిత ధనంతో ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. భూములపై స్పష్టమైన పరిష్కారం ఇవ్వాల్సిన ప్రభుత్వ అధికారులు సమస్యను దీర్ఘకాలంగా నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.

భూదాన్ ఉద్యమం ద్వారా పేదలకు ఇవ్వాల్సిన భూములు పేదల జీవనాధారంగా మారాల్సింది పోయి, రికార్డుల గందరగోళం మరియు అధికారుల నిర్లక్ష్యంతో వివాదాల కేంద్రంగా మారడం విచారకరమని పేర్కొన్నారు. భూముల విలువలు పెరిగిన తరువాత మాత్రమే ప్రభుత్వం అక్రమ ఆక్రమణల పేరుతో చర్యలు తీసుకోవడం ప్రజలలో అనుమానాలు రేకెత్తిస్తున్నదని ఆయన అన్నారు.

ఇటీవల నిర్వహించిన భారీ ఎత్తున కూల్చివేత చర్యల వల్ల సుమారు 600 కుటుంబాలు, దాదాపు 3000 మంది ప్రజలు ఒక్కసారిగా గూడు కోల్పోయి రోడ్డునపడ్డారని సత్యం ఆవేదన వ్యక్తం చేశారు. పేదల జీవితకాల పొదుపులతో నిర్మించిన ఇళ్లు ఒక్కరోజులో కూల్చివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ముందస్తు పునరావాసం కల్పించకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాన్ని సూచిస్తుందని విమర్శించారు.

ప్రభుత్వం తర్వాత సర్వేలు చేస్తామని, ఇండిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రకటించడం సరిపోదని, ముందుగా బాధిత కుటుంబాలకు తక్షణ పునరావాసం కల్పించి, భూదాన్ భూములపై స్పష్టమైన విధానం ప్రకటించాలని సత్యం డిమాండ్ చేశారు. మధ్యవర్తుల మోసాలకు గురైన పేదలపై చర్యలు కాకుండా, అలాంటి అక్రమాల వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

వెలుగుమట్ల ఘటన తెలంగాణలో భూసంబంధిత పరిపాలనలో ఉన్న లోపాలను బయటపెట్టిందని ఆయన పేర్కొన్నారు. పేదలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఆయన కోరారు.

భూమి కోసం పోరాడుతున్న వెలుగుమట్ల బాధిత కుటుంబాలకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ఉంటుందని గుజ్జ సత్యం స్పష్టం చేశారు. ప్రభుత్వం బాధితుల సమస్యలను సానుభూతితో పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed