February 22, 2026

ఐదేళ్లపాటు అధికారం..! అనధికార సంపాదనకు రాజమార్గంఅమ్ముకోవద్దు ఓటు…! కొని తెచ్చుకోవద్దు చేటు:డాక్టర్ కృష్ణ బంటు, స్వతంత్ర పాత్రికేయులు, రాష్ట్ర ఉత్తమ పాత్రికేయ అవార్డు గ్రహీత

0
IMG_20260208_182851

ఫిబ్రవరి8 హైదరాబాద్: భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి ఐదు ఏళ్లకు ఓసారి అని ఒక నిర్ణీత కాలాన్ని నిర్ణయించి గడువుగా పెట్టారు. దేశంలోని లోక్ సభ, రాజ్యసభ ల కాల పరిమితి గాని, రాష్ట్రాల శాసనసభ, శాసనమండలి కాలం పరిమితి గాని, స్థానిక సంస్థల కాల పరిమితి గాని ఐదేళ్లుగా నిర్ణయించి అమలు చేస్తున్నారు. అయితే ఐదేళ్ల దాకా ఒకే పార్టీ, ఒకే వ్యక్తి అధికారాన్ని అనుభవిస్తుండటం, ఇతరులకు అవకాశం రావడానికి ఐదు సంవత్సరాలు పడుతుండడంతో కాలపరిమితి తగ్గితే బాగుండు అని అనుకుంటున్న సందర్భాలు, చర్చలు అనేకం. రాను రాను ప్రతిదీ స్పీడ్ హైటెక్ యుగంలోకి మానవ జీవితం ప్రవేశించినందున దేనికోసమైనా, ఎంతకాలమైనా, ఎదురుచూసే ఓపిక, సహనం నశించడం, మనిషి ఆలోచనలోనే మార్పు రావడం, తదనుగుణంగా ఐదేళ్లపాటు ఒక్కరికే అధికారం ఎందుకనే అభిప్రాయాలు తరచుగా వ్యక్తం అవుతుండడం, ఐదేళ్ల కాలుపరిమితి తగ్గితే బాగుంటుంది కదా అనే ఒక ఆలోచనకు పలువురు మేధావులు, రాజకీయ ఉద్దండులు, తలపండిన రాజకీయ నేతలు, రాజ్యాంగ కోవిదులు ఆలోచన చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రభుత్వాల, ప్రజా ప్రతినిధుల కాల పరిమితి ఐదేళ్లు కాకుండా ఒక ఏడాది, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు ఇలా పలు రకాలుగా పలు దేశాలలో అమలులో ఉంది. దీంతో ఒకే రకమైన పాలనను అనేక సంవత్సరాలు అనుభవించే దుస్థితి తప్పుతుందని, తక్కువ సంవత్సరాలు అధికారం మాత్రమే ఉండడంతో సుపరిపాలన అందిస్తారని, ఎక్కువకాలం ప్రభుత్వాలు అధికారంలో ఉంటే ప్రజాస్వామ్య బద్ధంగా కాకుండా నియంతృత్వ ధోరణి ఆయా పాలకులలో కనిపిస్తుంది అనేది కొందరి వాదన. సంవత్సరాల తరబడి ఒకే పార్టీ గానీ, ఆయా పార్టీల తరఫున ఒకే వ్యక్తులు గాని అధికారం చాలా ఇస్తే సమాజంలో ఒక రకమైన మొనాటమి సంభవించడమే కాకుండా పాలకులు మరింత కఠినంగా వ్యవహరించి ప్రజలను పట్టించుకోవడం వదిలేస్తారని, కేవలం అధికారంలో ఉన్న వారి స్వార్థానికి పరిపాలన సాగిస్తూ నియంతృత్వం పెరిగిపోయి అక్రమార్జనకు దోహదం చేసినట్లు అవుతుందని మరికొందరి అభిప్రాయం. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన భారతదేశంలో పరిపాలన వ్యవధి తగ్గితే ప్రజలకు మేలు జరుగుతుందా, లేదా అనే అంశంపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకే పార్టీ సంవత్సరాల తరబడి అధికారంలో ఉంటే నియంత్రత్వం పెరిగిపోతుందా… ప్రజాస్వామిక వాదుల బలం తగ్గిపోతుందా.. కార్పొరేట్ శక్తులు తెర వెనక ఉండి ప్రభుత్వాలు నడిపించి, లక్షల కోట్ల ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తారా అన్న సందేహాలు దేశంలోని పలు ప్రాంతాల మేధావుల నుండి వినవస్తున్నాయి.

గెలిపిస్తే ఐదేళ్లు కనిపించరు…!సొంతసంపాదనకే సమయాన్ని వెచ్చిస్తరు…!*
దోచుకొని దాచుకోవడానికి మొగ్గు చూపిస్తరు…!!

ఒకసారి ఎన్నికలు జరిగి గెలిచినాక ప్రజా ప్రతినిధులైన రాజకీయ నాయకులు ఐదేళ్లదాకా ప్రజలను పట్టించుకోకుండా, ప్రజల వద్దకు రాకుండా, ప్రజలకు కనిపించకుండా పాలకులు ఉంటున్నారన్న విమర్శలూ లేకపోలేదు. ఒకసారి గెలిచి ఐదు సంవత్సరాలు తాము గెలిచిన ప్రాంతాలకు, ఓట్లు వేసిన ప్రజలకు ఎక్కడో దూరంగా ఉండి, తమకు ఓట్లు వేసిన ప్రజలను కనీసం పలకరించకుండా, గెలిచిన ప్రాంతాలకు తరచూ రాకుండా, కేవలం రాజధాని నగరాలకు పరిమితమై ఈ దేశానికి పట్టు కొమ్మలైన పల్లెలను, ఈ దేశానికి బువ్వ పెడుతున్న వ్యవసాయం చేసే ఓటర్లను మళ్లీ ఐదు సంవత్సరాల ఎన్నికలు వచ్చేదాకా కనిపించకుండా, పలకరించకుండా అధికారాన్ని అనుభవించి, అందిన కాడికి స్వాహా చేసి, తరతరాలు తినడానికి దోచుకుని, దాచుకొని తమ తమ వారసుల ఆస్తులను పెంచే దిశగా పాలకులు ఉంటున్నారే తప్ప, కనీసం పేదవాడి నోటిలోకి ఐదు వేళ్ళు సమయానికి వెళుతున్నాయా, వారి ఆకలి తీరుతుందా, వారి బాగోగులు పట్టించుకుందామా, వారి అవసరాలు తీరుద్దామా, వారి సమస్యలు పరిష్కరిద్దామా, ప్రతి మనిషికి అవసరమైన కూడు, గూడు అందుతుందా, అందుత లేదా అన్న విషయాలను ఈ రాజకీయ పాలకులు ఏనాడో విస్మరించారు అనడంలో కూడా అర్థం, పరమార్ధం, నిజం,వాస్తవం, సత్యం ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కొన్ని సంవత్సరాలపాటు వివిధ దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా చదివి, పరిశీలించి, క్రోడీకరించి అందించిన రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ బద్దంగా పాలన అందించకుండా, తమ సొంత ఎజెండాతో రాజ్యాంగాన్ని అమలు జరుపుతున్న పాలకులు, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేలా ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికి వదిలి ఐదు సంవత్సరాలు అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ, ఎన్నికలు సమీపించే కొద్ది సమయం ముందు ప్రజల ముందుకు వచ్చి, లేనిపోని ప్రేమ, ఆప్యాయతలను కురిపిస్తూ, మళ్లీ డబ్బు ద్వారా ఓట్లను కొనుగోలు చేసి, అధికారం సంపాదించి, మళ్లీ ఐదు సంవత్సరాల దాకా అదే అధికారంతో తాము ఎన్నికల కొనుగోలుకు వెచ్చించిన డబ్బులకంటే కొన్ని వేల రెట్ల డబ్బును వెనకేసుకుని,అధికారంతో కన్ను మిన్ను కానక పేదలను గాలికి వదిలేస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అందుకే ప్రజాస్వామ్యం పైకి ఒక మేడిపండు లాగా కనిపిస్తున్నప్పటికీ, ప్రజలు మాత్రమే ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాలని స్వేచ్ఛగా ఎన్నుకుంటున్నారన్న భ్రమను ప్రజలలో కల్పిస్తూ, దొడ్డి దారిన ఎన్నికలలో డబ్బుతో ఓట్లనుకొని, అధికారం చేపట్టి తిరిగి మళ్లీ ఐదు సంవత్సరాల దాకా డబ్బు సంపాదనలో మునిగి తేలుతున్న నయా పెట్టుబడుదారి, బూర్జువా, కార్పొరేట్ శక్తులు ఉన్నంతకాలం ఈ భారతదేశంలో పరిస్థితి ఇలానే ఉంటుందని మేధావులు అంచనా వేస్తూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే అధికార పీఠంపై ఏళ్ల తరబడి కొందరే వారసత్వ హక్కులు వచ్చినట్లుగా భారత ప్రజల ఓట్లను గుండు గుత్తగా కొనుక్కుంటూ, అధికారాన్ని చేజిక్కించుకొని,ప్రజలను తోలుబొమ్మలా, ఆట బొమ్మల్లా ఆడిస్తూ తమ పబ్బం గడుపుకుంటూ, ప్రశ్నించే గొంతు లపై ఉక్కు పాదం మోపుతూ, నియంతగా వ్యవహరిస్తూ, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ, తాము మాత్రం లక్షల కోట్ల రూపాయలకు యజమానులుగా మారుతూ, ప్రజా ధనాన్ని లూటీ చేస్తూ, భారతదేశాన్ని ఒక పేద దేశంగా మారుస్తూ, అధికారం చేపట్టిన తాము మాత్రం లక్షల కోట్లకు పడగలెత్తి కోటీశ్వరులుగా చలామణి కావడం నేటి భారత ప్రజాస్వామ్యం చేసుకున్న, తెచ్చి పెట్టుకున్న ఒక దురదృష్ట దుస్థితి. అందుకే అధికార వ్యవధిని తగ్గిస్తే, ఐదేళ్లు కాకుండా ఓ రెండు, మూడు సంవత్సరాలకో ఎన్నికలు జరిగితే కొంతలో కొంత రాజకీయ అవినీతిని తగ్గించే మార్గం ఉంటుందేమో అన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

విలువైనది ఓటు..! వృధా చేసి తెచ్చుకోకు చేటు…!!

ప్రజాస్వామ్యంలో ఓటు చాలా పవర్ఫుల్ అని ప్రతి మనిషి తెలుసుకోవాలి. విలువైన ఓటును ఉపయోగించుకోకుండా, ఉన్న ఓటును అమ్ముకున్నా జరిగే నష్టం మాత్రం దేశానికి, ఈ వ్యవస్థకు, తద్వారా వ్యక్తికి నష్టం వాటిల్లక తప్పదు. ఓటు వేయలేనంతగా బిజీ జీవితాన్ని గడుపుతున్న నేటి ప్రజానీకం ఓటు వేయకుంటే, ఆ ఓటును వేరే వారు దొంగ ఓటుగా వేస్తే, దొంగల రాజ్యం అవతరిస్తే, అందుకు ఓటు వేయని వారు బాధ్యులు కారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఓటు వేసినా కూడా నీతి, నైతికత కలిగిన మంచి వ్యక్తులకు కాకుండా, అక్రమార్కులకు, విక్రమార్కులకు, అవినీతిదారులకు ఓటుని అమ్ముకుంటే జరిగేది కూడా మానవ ప్రగతికి ఆటంకమే తప్పించి, మానవ సమాజం లో అభివృద్ధి, సంక్షేమం కనుమరుగైన వాస్తవాలుగా సాక్షాత్కరించక మానవు.
విలువైన ఓటుని అమ్ముకోవడం వలన కలిగేది ఒక అనిచ్చిత పరిస్థితి. అందుకే ప్రజలు మారాలి, నాయకులను నిలదీయాలి, ఓటును అమ్ముకోపమని శపధం చేయాలి, నిజాయితీ, సచ్చిలత, నైతిక విలువలు కలిగిన మానవతామూర్తులను చట్టసభలకు పంపాలి. ప్రజాస్వామ్యానికి అసలైన నిర్వచనం గా నిలవాలి. ప్రజాస్వామ్యాన్ని బతికించాలి. ప్రజాస్వామ్య బద్దంగా పాలన కొనసాగేలా పాలకులపై ఒత్తిడి తేవాలి. ప్రశ్నించే తత్వాన్ని పెంచుకొని సుపరిపాలన అందించే దిశగా పాలకులపై నిలబడి, కలబడి పోరాడాలి. ఆ దిశగా ప్రతి వ్యక్తిలోనూ మార్పు రావాలి. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలి. విద్యావంతులైన వారు కూడా ఓటును వినియోగించుకోకుండా ఓటు విలువను దిగజారుస్తున్నారు. ఓటు గొప్పదనాన్ని తెలుసుకోవాలి. ఓటు ద్వారా తగిన నేతలను ఎన్నుకోవాలి. తద్వారా ప్రపంచంలోనే భారత ప్రజాస్వామ్య విలువలను కాపాడుకొని భారతదేశ గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని వెలుగెత్తి చాటాలి.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed