అంతు చిక్కని అర్బన్ ఓటర్ మది…! అదొక చిక్కుముడుల రహస్య గది…!!!ఓటర్లను ప్రసన్నం చేసుకునే సమయం ఆసన్నo,ఓట్ల కోసం అభ్యర్థులకు తప్పని పాట్లు…!!✍️ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ కృష్ణ బంటు, ఇండిపెండెంట్ జర్నలిస్టు, కవి రచయిత.రాష్ట్ర ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత
ఫిబ్రవరి 4 హైదరాబాద్:ఇది ఓట్ల కాలం. ఓట్లు అభ్యర్థించే కాలం.పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే కాలం.ప్రస్తుతం తెలంగాణ అర్బన్ ప్రాంతాలలో నడిచేది ఓట్ల పండుగ కాలం.ఓట్లు అయిపోయాక ఓట్లు వేయించుకున్న వాళ్లు అధికార అందలాలు ఎక్కి పండగలు చేసుకుంటే పట్టించుకునే వాడు లేక ఓటర్ అన్న జీవితం దండగ అనుకునే కాలం.బుధవారం నుంచి ప్రచారం ప్రారంభం అవుతుండడంతో ఇకనుంచి ఓటర్ల ఇంటిముందు పోటీలో ఉన్న అభ్యర్థులు క్యూ లైన్లు కట్టే కాలం.ఎలాగైనా ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టాలని కలలు కనే కాలం.కలలను నిజం చేసుకునే కాలం. తాము కన్న కలలు కల్లలు కాకుండా భద్రంగా వ్యవహరించే కాలం.అధికారాల పీఠాలు ఎక్కే కాలం. అధికార పీఠం అధిరోహించడానికి ఓట్ల కోసం పడరాని పాట్లు పడే కాలం.ఓటర్ న్న ప్రాపకం కోసం ఎన్నో రకాల ఫీట్లు చేసే కాలం. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఓట్ల పండుగ కాలం.
ఎన్నికల్లో ఓట్లు పొందడానికి పోటీలో ఉన్న అభ్యర్థులు మద్యం, మనీ ఇంటింటికి పంచే కాలం.
పొద్దంతా ఓట్ల కోసం తిరిగి తెల్లవార్లు ఊగుతూ తాగుతూ గడిపే సంతోషంగా సరదాగా ఎంజాయ్ చేసే కాలం.
అన్ని రకాల తాంబూలాలు అందించే కాలం. తాయిలాల ఆశలు చూపి ఆశయాలు నెరవేర్చుకునే కాలం.
ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే కాలం. అభ్యర్థుల విన్నపాలకు ఓటర్లు ప్రభావితం అయ్యే కాలం.
ఓటరన్న ను ఆసన్నం చేసుకొని ఆశీర్వచనాలు అందిపుచ్చుకునే కాలం. ఓటు మీకే వేస్తామని ప్రమాణాలు చేయించుకునే కాలం.
ఆయా మతాలకు అనుగుణంగా దేవుళ్ళ పటాలను ఉపయోగించుకునే కాలం. దేవుళ్ళ పటాల మీద, వెలిగే హారతుల వద్ద ప్రమాణం చేయించుకునే కాలం.
కులాల వారీగా మతాలవారీగా ఓట్లు అడుక్కునే కాలం.
ఓట్ల కోసం అవసరమైతే కులమత ఘర్షణలు రెచ్చగొట్టే కాలం.
పోటీలో ఉన్న అభ్యర్థులు ఓట్ల కోసం హీనంగా దీనంగా బిచ్చమెత్తుకున్నట్టు ఓటును అడుక్కునే కాలం.
ఓటరు దేవుళ్ళారా, మీకు వేల వేల వందనాలు అంటూ కాళ్ళ మీద పడి ప్రాధేయపడే కాలం.
కడుపులో తల పెట్టి మంచితనాన్ని మదిలో నింపుకొని ఓట్లు అభ్యర్థించే కాలం.
ఓటర్ అంటే ఎక్కడలేని ప్రేమ, ఆప్యాయతలు ఒలక బోసే కాలం.
నమ్మకంగా ఓట్లు అడిగేకాలం. నమ్మినాక నట్టేట ముంచేకాలం.
ఎక్కడ లేని బంధుత్వాలు, మిత్రుత్వాలు ఆపాదించుకొని నీది నాది బీరకాయ పీచు అంటూ బంధుత్వాలు కలుపుకునే కాలం.
అన్నా, అక్క, తమ్ముడు, చెల్లి,అమ్మ,అయ్యా, మామ, అత్త, ఆంటీ, బాబాయ్ అంటూ వరుసలు కలుపుకొని ఓట్లు పొందే కాలం.
ఇది విందులు వినోదాల కాలం
సుక్క ముక్క, బిర్యాని దొరికే కాలం
చికెన్ సెంటర్లు, మటన్ షాపులు, చేపల వ్యాపారం, మద్యం షాపులు కలకలలాడే కాలం
ఓట్ల కోసం చీర సారెలు, కుంకుమ బరినెలు, మందు బాటిల్లు పంచే కాలం
ఇది ప్రచారాల కాలం
ప్రచారాలు చేస్తూ ఓట్లు అభ్యర్థించే కాలం
తెల్లారి లేస్తే చెవులు తూట్లు పడేలా ప్రచార రధాలు, మైకుల ఆటోలు తిరిగే కాలం, మైకులు హోరెత్తించే కాలం.
పార్టీల తరఫున నినాదాలు ఇస్తూ జై కొడుతూ వార్డులన్నీ ప్రచారం చేసే జనాలతో కలకలలాడే కాలం.
ఇంటింటికి, వీధి వీధికి కరపత్రాలు, పోస్టర్లు బ్యానర్లు పంచేకాలం. గోడలకు, డోర్లకు అంటించే కాలం
ప్రింటింగ్ ప్రెస్ లకు, ఫ్లెక్సీలకు, మైక్ సెట్లకు గిరాకీ కాలం
ఉదయాన్నే లేచింది మొదలు సాయంత్రం వరకు రంగురంగుల పార్టీల జెండాలు ఎగురుతూ కనిపించే కాలం
ఓట్ల ప్రచారానికి ప్రజలు రోజు వారు కూలీలుగా మారే కాలం
పల్లె ప్రాంతాల ప్రజలు కూడా పట్టణాలకు వలసలు వచ్చి ప్రచారంలో పాల్గొని పైసలు సంపాదించుకునే వలసల కాలం
ఆయా పట్టణాల్లో నెలకొన్న కూలీల అడ్డాలు మొత్తం బోసి పోయేకాలం
అన్ని రకాలుగా పనులన్నీ కుంటుపడి. కేవలం ఎన్నికల ప్రచారమే హైలెట్ గా ఉండే కాలం
చేతుల్లో జెండాలు పట్టుకొని అధికారమే ఏజెండాగా ఇంటింటికి తిరిగే కాలం
ఇది హామీల కాలం, హామీలు ఇచ్చే కాలం, హామీలు అమలు చేసినా చేయకున్నా హామీలు ఇచ్చే కాలం
అధికారంలో ఉన్న పార్టీ ఒకరకంగా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఒక రకంగా ఓట్లను ఆకట్టుకోవడానికి పలు రకాల తాపత్రయాలు పడే కాలం
వాస్తవానికి ఒక రకంగా ఓట్లు అమ్ముకునే కాలం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే కాలం
ఓటు విలువైనదని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పిన విషయాలను తుంగలో తొక్కుతున్న కాలం
అమీర్ అయినా గరీబ్ కైనా ఓటు ఒకటే అంటూ అంబేద్కర్ నిబంధనలు పెట్టిన కాలం
అగ్రకులాలకు, ధనవంతులకు, కార్పొరేట్లకు మాత్రమే ఓట్లు ఉండాలనే వాదనను అంబేద్కర్ తిప్పి కొట్టిన కాలం
బడుగులకు, బహుజనులకు ఓట్లు ఎందుకు దండగ అని కొందరు నాయకులు చెప్పిన దానికి అంబేద్కర్ చెంపపెట్టులా విమర్శిస్తూ అందరికీ ఒకటే ఓటు హక్కు ఇచ్చిన కాలం
మెజార్టీగా 85% ఉన్న ఈ దేశంలోనీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, బడుగు,బలహీన, బహుజను ల అందరికి కూడా ఓటు అనే వజ్రాయుధాన్ని చేతికిచ్చి బలమైన ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకోవాలని హితవు పలికిన కాలం
ఓటు ద్వారా రాజ్యాధికారమనే మాస్టర్ కీ ని బహుజనులు సాధించాలని అంబేద్కర్ బోధించిన కాలం
మరి కొందరు ఓటు కూడా వేసే ఓపిక లేక ఇంటికి పరిమితమైన కాలం
ఓటు వేస్తే ఏమొస్తుంది ఎందుకు వేయాలని వెయ్యాలే అంటూ కాలు గడప దాటని కాలం
మనిషన్నాక, ఓటు ఉన్నాక ఉపయోగించుకోవాలనే కనీస ఇంగిత జ్ఞానం కరువవుతున్న కాలం
కనీసం ఐదేళ్లకు ఒకసారి మాత్రమే ఓట్ల పేరున తమ ఇంటికి పోటీ చేసే అభ్యర్థులు వస్తున్నందున ఎంతో కొంత దక్కుతుంది కదా అనుకుని ఆశపడే కాలం
ఓట్లు వేయించుకొని గెలిచాక తమ మొహం చూపించకుండా మళ్లీ ఐదేళ్లకే కనిపించే నాయకులు ఉన్నారని ఓటర్లు తలంపుతో ఉన్న కాలం
ఓట్లు కొని పెట్టుబడి పెట్టాము, ఇది కూడా ఒక వ్యాపారమే, పెట్టిన పెట్టుబడికి ఐదేళ్లలో సంపాదించుకోకుండా ఎలా ఉంటాము అని గెలిచే అభ్యర్థులు అనుకునే కాలం
అందుకే నీ భవిష్యత్తును నిర్ణయించే ఓట్లను జాగ్రత్తగా ఆలోచించి మంచి సమాజం కోసం వెచ్చించాల్సిందిగా ఓటర్లను వేడుకొంటున్న కాలం
ఇది ఓట్ల కాలం…ఇది ఓట్ల కాలం. కోట్ల రూపాయలు చేతులు మారే పండుగ కాలం