పార్టీలలో రెబల్స్… వారితోనే ట్రబుల్స్…!పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి వ్యతిరేకంగా పోటీ…! పార్టీ అభ్యర్థులను ఓడించడం రెబల్స్ కు పరిపాటి…!!రెబెల్స్ గెలిచేది తక్కువ… హాని చేసేది ఎక్కువ…!!పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్లుగా…. ఒకే పార్టీలో ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉంటే వేరే పార్టీ అభ్యర్థి గెలుస్తాడు ఎట్లాగా…!!అన్ని పార్టీలకు రెబల్స్ టెన్షన్…! రెబల్స్ విత్ డ్రా ల మీదనే పార్టీల అటెన్షన్…!!!ప్రస్తుతం నడుస్తుంది సర్వం… రెబల్స్ బుజ్జగింపుల పర్వం…!!!✍️ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ కృష్ణ బంటు, ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత
హైదరాబాద్ ఫిబ్రవరి 1:ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది సర్వం రెబల్స్ బుజ్జగింపుల పర్వం. పార్టీ బి ఫామ్ ఇస్తుందో, ఇవ్వదో, పార్టీ తమను అధికారిక అభ్యర్థిగా గుర్తిస్తుందో, లేదో, అన్న మీ మాంస లో, పలు రకాల సమస్యలతో సతమతమవుతూ ఇన్నాళ్ల రాజకీయ జీవితానికి అరంగేట్రం చేయడానికి కొందరు, అనుభవాన్ని ఉపయోగించుకొని మరోసారి బరిలో మున్సిపల్ ఎన్నికల బరిలో నిలవాలన్న తలంపుతో మరి కొందరు అభ్యర్థులు నామినేషన్ అయితే వేశారు గాని పోటీలో ఉంటామో, ఉండమో అన్న సందిగ్ధ పరిస్థితులతో కొట్టు మిట్టాడుతూ ఎలాగైనా రెబల్స్ గా అయినా పోటీలో ఉండాలని ఒక దృఢ నిర్ణయంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకే విత్ డ్రా సమయం దగ్గర పడేకొద్దీ టికెట్ వస్తుందన్న అభ్యర్థుల్లో ఆశ ఉండగా టికెట్ రాకుంటే ఎలాగా అనే అయోమయంలో మరికొందరు అభ్యర్థులు అటు ఆకాశం, ఇటు భూమి మీద కాకుండా అవకాశాల కోసం ఊగిసలాడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికలలో రెబల్స్ మాట వింటేనే అన్ని పార్టీల నాయకులలో గుబులు పుడుతుంది. నామినేషన్ల విత్ డ్రాకు కొద్ది సమయమే ఉండడంతో రెబల్స్ ను బుజ్జగించే పనిలో ఆయా పార్టీలు తల మునకలై ఉన్నాయి. ఏ వార్డు నుంచైనా పార్టీ తరఫున పోటీ చేసేది ఒకే అభ్యర్థి కావడంతో ఆయా పార్టీల తరఫున ఒకరి కంటే ఎక్కువమంది నామినేషన్లు దాఖలు చేయడంతో మిగతా వారిని సంప్రదించి, సర్ది చెప్పి, బుజ్జగించి, నచ్చజెప్పి ఎలాగైనా పోటీ నుంచి విరమింపజేసి, పార్టీ అభ్యర్థిని తప్పకుండా గెలిపించుకోవాలనే తలంపుతో రాజకీయ పార్టీలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.
రంగంలోకి ట్రబుల్ షూటర్స్…. సెటిల్ చేసేనా రెబెల్స్ మేటర్స్ …!!
రెబల్స్ ను, బతిమాలి, బామాలి, భయపెట్టి, బంగపెట్టి, నయాన్నో, భయాన్నో దారికి తెచ్చుకుని పోటీ నుంచి విరమింప చేయడానికి రాజకీయ అనుభవం కలిగిన ట్రబుల్స్ షూటర్స్ ని ఆయా పార్టీలు రంగంలోకి దింపాయి. ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించగల, సామ దాన భేద దండోపాయలతో రెబెల్సును దారికి తీసుకు రాగల ఉద్దండ రాజకీయ పండితులు అందరూ నేడు కంకణ బద్ధులై రాయబారాలలో మునిగి తేలుతున్నారు. అవసరమైన చోట విందులు, వినోదాలు ఏర్పాటుచేసి రెబెల్స్ కు అవసరమైతే డబ్బు ఆశ చూపి, రాబోయే కాలంలో కాబోయే నాయకులు మీరేనంటూ ఆకాశానికి ఎత్తి స్వర్గలోక విహారం చేపిస్తూ, భవిష్యత్తు రాజకీయ జీవితాన్ని బలి చేసుకోవద్దు అంటూ హీతవు పలుకుతూ, రానున్న భవిష్యత్తు రాజకీయ చిత్రపటాన్ని కళ్ళ ముందు కనిపించేలా సకల విద్యలను ప్రదర్శిస్తున్నారు. అవసరమైతే రెబల్స్ ను చల్ల పరచడానికి, మెత్తబుచ్చడానికి, ఎన్నికల బరి నుండి తప్పుకోవడానికి ఆయా పార్టీల స్థానిక నాయకత్వంతో పాటు కొన్నిచోట్ల శాసనసభ్యులు, మరికొన్ని చోట్ల నియోజకవర్గాల ఇన్చార్జిలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎన్నికల ఇన్చార్జీలు, పార్టీ పరిశీలకులు,ఇంకా కొన్ని అనివార్యమైన తప్పని పరిస్థితులలో మంత్రులు కూడా రంగంలోకి దిగి పరిస్థితులను చక్కబెడుతున్నారు. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్టుగా రెబల్స్ రంగంలో ఉంటే పార్టీ అభ్యర్థికి తీవ్ర నష్టం జరగడమే కాకుండా పార్టీ ఓటమి పాలు అవుతుందని రెబల్స్ అభ్యర్థులకు నచ్చజెప్పుతూ, పరిస్థితిని వివరిస్తూ, భవిష్యత్తులో అవసరమైతే నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీలు ఇస్తూ, ప్రతికూల పరిస్థితులను కొలిక్కి తెస్తున్నారు. ఇంకా పోటీలో ఉంటామని భీష్మించుకు కూర్చునే ముదురు రెబెల్స్ అభ్యర్థులకు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉంటే పార్టీ నుంచి బహిష్కరించే వేటు తప్పదనే సంకేతాలు కూడా పంపిస్తున్నారు. ఒకసారి పార్టీ నుంచి గెంటివేస్తే ఎంత పెద్ద నాయకుడైనా బలహీనుడు కాక తప్పదని, ఒంటరిగా ఉండి ఎన్నికలను ఎదుర్కోవటం చాలా కష్టమని, పార్టీ అండ అనేది కొండంత ధైర్యం అని చెబుతూ ఒకసారి పార్టీ బహిష్కరణ గురైతే రాజకీయ సమాధి కట్టుకున్నట్టేనని ట్రబుల్ షూటర్స్ స్పష్టం చేస్తున్నారు. అర్హులైన వారికి పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపడితే ఆయా ప్రాంతాలలో కో ఆప్షన్ సభ్యులుగా చేస్తామని ఆశ చూపెడుతున్నారు. కలిసి నడుద్దాం, విజయాలు సాధిద్దాం, అధిక కార్పొరేషన్ లు, మున్సిపాలిటీలు దక్కించుకునేలా ప్రణాళికలు చేద్దాం అనే స్లోగన్ తో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు వ్యూహరచనలో నిమగ్నమై ఎన్నికల రణరంగంలో దూసుకెళ్తున్నాయి. అయితే పార్టీ నాయకత్వం ఇస్తున్న హామీలను నమ్మి రెబల్స్ పోటీ నుంచి తప్పుకుంటారా, హామీలు వద్దు, ఆశలు వద్దు అంటూ తప్పక పోటీ చేస్తామని దృఢంగానే ఉంటారా, అనేది ఫిబ్రవరి మూడో తారీఖున తెలియనుంది.