స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం తీర్మానించింది
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం తీర్మానించింది. ఇందుకు సంబంధించి ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ అంశంపై ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం చర్చించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించింది. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత మార్చి నెలలో జరిగిన సమావేశాల్లో బిల్లులకు శాసనసభ ఆమోదించి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి నివేదించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటివరకు జరిగిన 18 మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలును సమావేశం చర్చించింది. గతంలో జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో ప్రధానమైన 23 శాఖలకు సంబంధించి 327 అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. వాటిల్లో 321 నిర్ణయాలు అమలు జరగ్గా మిగిలిన ఆరింటిపై మంత్రిమండలి అవసరమైన వివరణను ఇచ్చింది. ఇకనుంచి ప్రతి రెండు వారాలకు ఒకసారి విధిగా మంత్రివర్గం సమావేశం కావడమే కాకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్ణయాల అమలును సమీక్షించాలని తీర్మానించింది. రాష్ట్రంలోని 306 గోశాలల నిర్వహణపై సమగ్రమైన పాలసీని తీసుకురావాలని నిర్ణయించారు. చివరి దశలో అసంపూర్తిగా ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణ ప్రక్రియను సత్వరం పూర్తి చేయాలని చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. సమావేశం నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, జూపల్లి కృష్ణా రావు గారు, వాకిటి శ్రీహరి గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు వెల్లడించారు.