వీర తెలంగాణ అగ్గిరవ్వ దొడ్డి కొమురయ్య
జూలై 4: తెలంగాణ చరిత్రలో జులై 4 అతి ముఖ్యమైన రోజు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి అంకురార్పణ జరిగిన రోజు. భారతదేశ స్వాతంత్య్రోద్యమ చరిత్రలోనే మహౌజ్వల ఘట్టంగా భాసిల్లిన వీర తెలంగాణ పోరాటాన్ని రగిలించిన అగ్గి రవ్వ.. దొడ్డి కొమరయ్య అమరుడయిన రోజు. కొమురయ్య అమరత్వానికి నేటితో 75ఏండ్లు నిండుతున్నాయి. దొడ్డి కొమురయ్య యాది.. వీర తెలంగాణ పోరాట స్ఫూర్తి.. నేటి తరానికీ మార్గదర్శనమై, నేడు మనం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దిక్సూచియై విరాజిల్లుతున్నవి.తెలంగాణ, మరాట్వాడా ప్రాంతాలతో పాటు 3 కన్నడ జిల్లాలు కలిగిన హైదరాబాద్ సంస్థానాన్ని ఏడవ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలిస్తున్న రోజులవి. పైన ముస్లిమ్ రాజు.. రాజుకు అండగా ఉన్న హిందూ దొరలు కలగలిసి.. హైదరాబాద్ సంస్థానంలోని అన్ని మతాల ప్రజలపై అనేక దౌర్జన్యాలను కొనసాగిస్తున్న ఫ్యూడల్ పాలన నడుస్తున్న కాలమది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర పోరాటం నడుపుతున్న జాతీయ కాంగ్రెస్ నాయకత్వం.. ”స్వదేశీ సంస్థానాల వ్యవహారాల్లో తలదూర్చ కూడదు” అనే నియమాన్ని పాటిస్తూ.. నిజాం రాజుకు పరోక్షంగా అండగా నిలిచింది.