మనసు కవి ఆత్రేయ గారికి మనస్ఫూర్తిగా నివాళులు
Oplus_131072
తెలుగు సినిమా పాటకు మనసు తడిని అద్దిన కవి ఆత్రేయ. మనోలోతుల్ని అక్షరాల్లో రంగరించి ప్రతి గుండెకు పాటల రూపంలో అందించిన మనస్వి. నాటకాల తో ప్రజాచైతన్యానికి బాటలు వేసిన అభ్యుదయ వాది. అలతి పదాల్లో అనల్పార్థాన్ని నింపిన భావకుడు. తెలుగుతెర వెండి పాటల్లో చందమామ లా ప్రకాశించే సూర్యుడు ఆత్రేయ.
ఆత్రేయ అసలు పేరు కిళాంబి వేంకట నరసింహాచార్యులు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట తాలూకా మంగళంపాడు లో మే7, 1921ల జన్మించారు. చిన్ననాడే తల్లి మరణించింది. వీరిది ఆత్రేయ గోత్రం. అందుకే పేరును గోత్రంతో కలిపి ఆచార్య ఆత్రేయ అని పేరు పెట్టుకున్నారు. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే నాటకాలమీద మోజుతో చదువుకు స్వస్తి పలికాడు. ఆ పైన టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉద్యోగం కూడా చేశారు. లేఖకునిగా, గుమస్తాగా, పత్రికా సంపాదకునిగా ఉద్యోగాలు చేసి… చివరకు సినీరంగంలో స్థిరపడ్డారు.
పాటల రచయితగానే కాకుండా ఆత్రేయకు నాటక రచయితగా గొప్ప పేరు ఉంది. ఎన్.జి.ఓ. ఈనాడు నాటకాలు రచించి ప్రదర్శనలు ఇస్తూ ఆనాడు ఆంధ్ర దేశం అంతా పర్యటించారు. 1949 లో ‘ఎన్జీవో’ నాటకానికి ఆంధ్ర నాటక కళా పరిషత్ పోటీలలో ప్రథమ బహుమతి వచ్చింది. అటుపై హ్యాట్రిక్ కూడా సాధించింది. ఆత్మకథను ‘తొలిగాయం’ పేరుతో పద్యరూపంలో రాశారు. వీరి రచనలు మొత్తం 9 సంపుటాలుగా మనస్విని సంస్థ ముద్రించింది. అంతేకాదు ఆరోజుల్లో ఆత్రేయ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆర్నెళ్లు జైలు శిక్షకూడా అనుభవించారు. తర్వాత క్రమంగా కమ్యూనిస్టు భావాలవైపు ఆకర్షితులయ్యారు.
1951లో విడుదలైన 'దీక్ష'చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమై సుమారు 400 సినిమాలకు,1400 పాటలు రాశారు. ఆత్రేయ తన పాటల్తో మనసుకు కొత్త భాష్యాలు చెప్పాడు. మనసులోని భావాల్ని, అంతరంగ లోతుల్ని, పొరల్ని విడివిడిగా తన పాటల్తో అల్లారు. సరళమైన పదాలతో పాటలు రాశారు. ప్రజల మాటల్నే పాటలు చేశాడు. ఆత్రేయ పాటలన్ని భావోద్వేగాల సమాహారంగా ఉండటంతో ఆత్రేయను 'మనసు కవి'గా ప్రేక్షకులు, అభిమానులు అభివర్ణించారు. ఎంతటి బరువైన భావాలనైనా అర్థవంతమైన తేలికైన పదాలతో పలికించడంతో ఆత్రేయ దిట్ట. మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూశారు. పాటల్లో తన అనుభవాలను పొదిగి, గుండె బరువును దించుకునే వారని అతను సన్నిహితులు పలు సందర్భాల్లో చెప్పారు.
ఇలా ప్రేక్షకుల మనసుపై మనసు కవిగా ముద్రపడిన ఆత్రేయ సెప్టెంబరు13, 1989లో మరణించారు. ఆయనే చెప్పినట్లు 'మనసు పోతే మాత్రమేమి మనసు ఉంటది'. ఆయన పాటలు మన మనసుల్లో పదిలంగా ఉన్నాయి. జీవితం లోని ప్రతి క్షణాన్ని ఆ పాటల్లో వెదుక్కునేలా చేస్తున్నాయి. చేశాయి. చేస్తాయి.
సేకరణ: డా రవీంద్ర గారి వ్యాసం నుంచి 🙏
మనసు కవి ఆత్రేయ గారికి మనస్ఫూర్తిగా నివాళులు 🙏🌺🌺