December 24, 2025

మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం. ఇండియాస్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ – 2025’ జాబితాలో చోటు

0
IMG-20250813-WA3501

ఆగస్టు 13 హైదరాబాద్:


రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ తాజాగా ప్రకటించిన ‘ఇండియాస్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ – 2025’ జాబితాలో ఆయనకు చోటు లభించింది. తమ సమర్థవంతమైన నాయకత్వం, నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహామిస్తూ భారత్ ను ఏఐ రంగంలో అగ్రగామిగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్న వ్యక్తులకు ఇందులో చోటు కల్పించారు. విధాన రూపకర్తల విభాగంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, పీయూష్ గోయల్, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఇండియా ఏఐ మిషన్ సలహాదారు ఆకృత్ వైష్, ఇండియా ఏఐ మిషన్ సీఈవో, ఎన్ఐసీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, ఎన్ పీసీఐ సీఈవో దిలీప్ అస్బే, నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్, నాస్కామ్ మాజీ అధ్యక్షులు దేబజాని ఘోష్ తదితర ప్రముఖులను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు.

** ఏఐ రంగంలో రోల్ మోడల్ గా తెలంగాణ **

మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో ఏఐ రంగంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ మారిందని, అందుకే ఆయనను ఈ జాబితాలో చేర్చినట్లు అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ నిర్వాహకులు ప్రకటించారు. ‘బాధ్యతాయుతమైన ఏఐ అమలు కోసం సమగ్ర ఏఐ ఆధారిత తెలంగాణ స్ట్రాటజీ అండ్ రోడ్ మ్యాప్ ను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించారు. గుడ్ గవర్నెన్స్, నూతన ఆవిష్కరణలు, సురక్షితమైన డేటా షేరింగ్‌ను ప్రోత్సహించేలా దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్ ను ప్రారంభించేందుకు చొరవ చూపారు’ అని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబును కొనియాడారు. ‘గ్లోబల్ ఏఐ సమ్మిట్ నిర్వహణలోనూ మంత్రి శ్రీధర్ బాబు కీలకంగా వ్యవహరించారు. తెలంగాణలో ఏఐ ఎకో సిస్టమ్ ను మరింత బలోపేతం చేసేలా 2025–26లో 100 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఆర్ అండ్ డీ, నూతన ఆవిష్కరణలు, అత్యంత నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేయాలనే సంకల్పంతో ఏర్పాటు కానున్న ఏఐ యూనివర్సిటీ విషయంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు’ అని ప్రశంసించారు. ఏఐ రంగంలో తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమయ్యేలా మంత్రి శ్రీధర్ బాబుకు దక్కిన ఈ గుర్తింపు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

** సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సహాంతోనే ఈ గుర్తింపు ; మంత్రి శ్రీధర్ బాబు ఇది నా ఒక్కడికి లభించిన గుర్తింపు కాదు. యావత్తు తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం. సమ్మిళిత వృద్ధి, మెరుగైన జీవితాలను అందించేందుకు ఏఐని వినియోగించాలన్న మా ప్రభుత్వ సుదూర దృష్టికి ఈ గుర్తింపు నిదర్శనం. సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతోనే నాకు ఈ జాబితాలో చోటు దక్కింది. ఆయన నాయకత్వంలో తెలంగాణను ఏఐ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్ గా తీర్చిదిద్దేలా పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. నూతన ఆవిష్కరణలకు సమానత్వాన్ని జోడించి, సాంకేతిక పురోగతి ఫలితాలు రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందేలా కృషి చేస్తున్నాం.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed