ప్రతి గ్రామంలో వైన్‌షాప్ – మద్యం వ్యసనం ఉధృతం (యువత చిన్నతనం నుండి మద్యానికి బానిసలు అవుతున్నారు)
నవంబర్ 2 మహేశ్వరం:
దేశంలో మద్యం వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది.విజయాన్ని జరుపుకోవడం,బాధను మరచిపోవడం పేరుతో యువతలో మద్యం అలవాటు వేగంగా విస్తరిస్తోంది.ఈ ధోరణి కారణంగా కుటుంబాలు,సమాజం,ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.తాజా జాతీయ నివేదికల ప్రకారం,ప్రస్తుతం భారతదేశంలో సుమారు 16 కోట్ల మంది మద్యం సేవిస్తున్నారు.వీరిలో 6 కోట్ల మంది ఇప్పటికే వ్యసనానికి బానిసలయ్యారు. పురుషులతో పాటు మహిళల్లో కూడా మద్యం వినియోగం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.ఈ వ్యసనంలో 18 నుండి 49 ఏళ్ల మధ్య వయస్సు గల యువత ఎక్కువగా ఉన్నారు. ఈ వయస్సు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే దశ కావడంతో,ఈ అలవాటు భవిష్యత్తులో తీవ్రమైన సామాజిక సమస్యలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది.
తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఆందోళనకరం
నివేదిక ప్రకారం దేశంలో అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాల టాప్ 10లో తెలుగు రాష్ట్రాలు రెండూ అగ్రస్థానాల్లో నిలిచాయి.
టాప్-10 మద్యం వినియోగ రాష్ట్రాలు
కర్ణాటక – 1వ స్థానం
తమిళనాడు – 2వ స్థానం
తెలంగాణ – 3వ స్థానం
ఆంధ్రప్రదేశ్ – 4వ స్థానం
మహారాష్ట్ర – 5వ స్థానం
ఉత్తరప్రదేశ్ – 6వ స్థానం
కేరళ – 7వ స్థానం
వెస్ట్ బెంగాల్ – 8వ స్థానం
రాజస్థాన్ – 9వ స్థానం
ఢిల్లీ – 10వ స్థానం
కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా,తెలంగాణ మూడో,ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానాల్లో ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల వరకు వైన్ షాపులు విస్తరించడంతో మద్యం వినియోగం సాధారణ జీవనంలో భాగమైపోయిందని సామాజిక సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
⚠️ నిపుణుల హెచ్చరిక
మద్యం సేవనం సామాజిక ఉత్సవాలుగా మారుతున్నా,దీని వెనుక దాగి ఉన్న ఆరోగ్య సమస్యలు,కుటుంబ విభేదాలు,ఆర్థిక నష్టాలు గుర్తించకపోతే భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది,అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో ప్రతి 2గ్రామ పంచాయతీకి ఒక వైన్ షాప్ ఉండటం,మద్యం వ్యసనం ఎంతగా విస్తరించిందో స్పష్టంగా చూపిస్తోంది.