December 24, 2025

ధ్యానంతో మనసుని సరైన మార్గంలో నడిపించి గమ్యాన్ని చేరవచ్చు

0
IMG-20250830-WA2031

ఆగస్టు 30 హైదరాబాద్: ఆధ్యాత్మికత అనే సరస్సులో నామం అనే రాయి వేసి శబ్దం చేస్తే తరంగాలు మొదలవుతాయి. అవి మనసంతా వ్యాపించి శరీరమంతా నిండిపోతాయి. ఏ నామాన్నయితే మనం స్మరిస్తున్నామో, ఆ దేవుడికి సంబంధించిన రూపాన్ని మన మదిలో నిలుపుతాయి. నామం ఆధ్యాత్మిక శబ్ద తరంగం.

బెల్లం బెల్లం అంటేనే బెల్లం రుచి మనకు తెలియదు. అలాగే, తేనె తేనె అంటే కూడా తేనె రుచి మనకు తెలియదు. బెల్లాన్ని కొరికి తినాలి. తేనెను నోటిలో వేసుకొని చప్పరించాలి. అప్పుడే ఆ మాధుర్యం మనకు అనుభవమవుతుంది.

దైవనామం, దైవం వేరు కాదు. ఆ పేరు స్మరించగానే అతడు మన దగ్గరుంటాడు. అది నిజం అని భగవదనుభూతిపరులు తెలియజేశారు. ఉపనిషత్తుల్లో భగవన్నామస్మరణ గురించి ఎన్నో వివరణలు ఉన్నాయి. పిలిస్తే పలికే భగవంతుడని ఎందరో భక్తులు రుజువు చేశారు.

సరే, నామం చెబుతాం. శబ్దం వినిపిస్తుంది. మన రూపంలాగా రూపం కనిపించదు. ఎంతకాలం నిరీక్షించాలి. ఎప్పుడు భగవంతుడు కనిపిస్తాడని చాలామందికి సందేహం. అందుకే కొంతకాలం నామం చెప్పి విసిగిపోయి విడిచి పెట్టేస్తారు. అక్కడే మనం నిలబడాలి. దైవం ఒక అనుభవం. ఇనుప ముక్కను బాగా కాలిస్తే అందులోకి ఉష్ణం వ్యాపిస్తుంది. ఆ ఉష్ణం ఇనుపముక్క ఎంతవరకు విస్తరించి ఉందో అంతవరకు వ్యాపిస్తుంది అందులో వేడి కనిపించకపోవచ్చు. ముట్టు కుంటే చుర్రుమనిపిస్తుంది. నామస్మరణతో మనసు పదేపదే భక్తిపూర్వకంగా సాధనలో ఉంచుతుంటే దేహమంతా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంగా మారుతుంది. కొన్నాళ్లకు మనసే మారిపోతుంది. పుట్టుక నుంచి వచ్చిన చెడ్డ గుణాలు ఒక్కొక్కటిగా మనల్ని వదిలిపోయి, వాటి స్థానే ప్రేమ వచ్చి చేరుతూ ఉంటుంది. నామస్మరణ చేయగా చేయగా వెదురు ముక్కలాంటి శరీరం వేణువవుతుంది. బృందావనంలో శ్రీకృష్ణుడు ఆలపించిన నాద మవుతుంది. ముల్లోకాలూ తిరిగి ‘నారాయణా! నారాయణా!’ అని స్మరించే నారదుడి చేతిలో తంబుర అవుతుంది. పరవశించి దివ్య తన్మయత్వంతో చేసే పరమశివుడి పంచాక్షరి అవుతుంది.

భక్తి-ప్రేమలను నింపి చేసే నామస్మరణకు మించిన యోగం లేదు. పూర్వజన్మ పుణ్యంవల్లనే ఆ భాగ్యం కలుగుతుంది. దాన్ని దక్కించుకున్నవారు తుకారాం, త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు, ప్రహ్లాదుడు లాంటి భక్తులు. వారే సజీవ సాక్ష్యంగా కాలంలో నిలిచి నామం గొప్ప తనాన్ని విశ్వానికి చాటారు.

పూజ నిమిత్తం సామగ్రి కొనాలి. నియ మాలు పాటించాలి. ధనం ఉండాలి. వ్రతాలకు, నోములకు కఠోర నియమాలుంటాయి. యజ్ఞాలకు, క్రతువులకు శక్తియుక్తులుండాలి. శాస్త్రం తెలిసి ఉండాలి. దోష రహితంగా చెయ్యాలి. అందుకే, కలియుగంలో నామస్మరణను మించింది లేదని ప్రతిపాదించారు పెద్దలు.

ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మనసును లగ్నం చేసి నామం స్మరించుకోవచ్చు. పనికి ముందు నామస్మరణ, పని తరవాత మళ్ళీ నామస్మరణ చేస్తూ ఉంటే, ఆ చేసే పని పవిత్రమవుతుంది. అందులోని దోషాలు హరించిపోతాయి. ఆ విధంగా చేసే కర్మ ఈశ్వరార్పణ కర్మ అవుతుందని భగవద్గీత చెబుతోంది.

ఎవరి పేరు వాళ్లకు ఇష్టం. మనందరికీ మనల్ని సృష్టించినవాడి పేరు ఎందుకు ఇష్టంగా ఉండదు? తప్పక ఉంటుంది. భయంలో, బాధలో, సుఖంలో, సంతోషంలో… పాలలో తేనెను కలుపుకొన్నట్లు జీవితంలో నామాన్ని కలుపుకోవాలి. దైవం ఎప్పుడూ కలవడానికి తొందరగా ఉంటాడు. మన నామస్మరణ ఈ రోజు మొదలు పెడితే ఇప్పుడే అతడు మనకు చేరువవుతాడు. సందేహం లేదు. ఇది రుషుల మాట. మన ఆధ్యాత్మిక జీవితానికి బంగారు బాట.

┈┉┅━❀꧁హరేకృష్ణ꧂❀━┅┉┈
ఆధ్యాత్మిక అన్వేషకులు
⛺🌸🚶🏻 🛐🙏🛐 🚶🏻‍♂️🌸⛺

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed