ఘనంగా లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ 72వ వార్షికోత్సవ వేడుకలు.
హైదరాబాద్, డిసెంబర్ 14:ప్రస్తుత పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో నైపుణ్యత సాధించినప్పుడే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ పేర్కొన్నారు. ఆబిడ్స్ లోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ 72వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మంత్రి అజారుద్దీన్, డాక్టర్ భూమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, డీన్ అంజలి జనార్దన్, ఇఫ్తే కార్ షరీఫ్, శైలేందర్ సింగ్, జయ సంహిత, చల్ల సునీత, భరత్ భూషణ్, పాఠశాల ప్రిన్సిపల్ బ్రదర్ ఆంటోనీ లు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అజరుద్దీన్ మాట్లాడుతూ… నేడు ఏఐ టెక్నాలజీతో సాంకేతిక రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, వాటికి అనుగుణంగా విద్యార్థులు చదువులతో పాటు సాంకేతిక రంగంలో మరింత అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. లిటిల్ పవర్ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు నేడు దేశ విదేశాల్లో ఉన్నత హోదాలో కొనసాగుతున్నారని, ఈ పాఠశాలలో విద్యార్థులకు నైపుణ్యత కలిగిన విద్యను అందించడంలో ఉపాధ్యాయుల ప్రత్యేక కృషి ఉందని అన్నారు. మంత్రి అజారుద్దీన్ ను ప్రిన్సిపల్ బ్రదర్ ఆంటోనీ, కరస్పాండెంట్ బ్రదర్ జె కబ్, వైస్ ప్రిన్సిపల్ అపోలో శాలువా, మెమొంటో, మొక్కలతో ఘనంగా సత్కరించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు, ఆర్కెస్ట్రా, కవ్వాలి, నాటక ప్రదర్శన, వివిధ పాటల పైన విద్యార్థుల నృత్యాలు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి. స్టేజ్ పైన పిల్లలు నృత్యాలు చేస్తుంటే వారి తల్లిదండ్రులు ఆనందంతో ఈలలు చప్పట్లతో అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అజిత్ కుమార్, సంపత్ కుమార్, బ్రిడ్జ్ మోహన్, రమేష్, శ్రీధర్, బాల్ రెడ్డి, దీప్తి జైస్వాల్, సునీత మరియా, లతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.