అక్టోబర్ 29న ప్రపంచ స్ట్రోక్ డే నిర్వహిస్తారు. ప్రాణాంతక స్ట్రోక్ (పక్షవాతం) గురించి అవగాహన
ప్రపంచ స్ట్రోక్ డే. ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న ప్రపంచ స్ట్రోక్ డే నిర్వహిస్తారు. ప్రాణాంతక స్ట్రోక్ (పక్షవాతం) గురించి అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. సాధారణ భాషలో.. స్ట్రోక్‌ను బ్రెయిన్ అటాక్ అంటారు. మెదడులోని రక్తనాళాలు పూడుకొనిపోయినా, పగిలిపోయినా, మెదడులోని ధమనులు, సిరల్లో రక్త ప్రసరణకు ఆటంకాలుంటే స్ట్రోక్ వస్తుంది. పోషకాహారం తీసుకుంటూ, లైఫ్‌స్టైల్‌లో మార్పులు చేసుకుంటే.. స్ట్రోక్‌ను నివారించవచ్చ
స్ట్రోక్ అంటే ఏంటి?
రక్త ప్రసరణకు అవరోధం కలగడం లేదా నరాలు చిట్లడం వల్ల సంభవించే అత్యవసర వైద్య పరిస్థితిని స్ట్రోక్ అని అంటారు. అంటే మెదడుకు ఆక్సిజన్, ఇతర పోషకాలను తీసుకెళ్లే రక్తనాళాలు చిట్లిపోవడం, రక్తసరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు మెదడులోని ఒక భాగానికి ఆక్సిజన్ అంతరాయం కలిగిస్తుంది. ఇది ఆ భాగానికి సంబంధించిన కణ మరణానికి దారితీస్తుంది. స్ట్రోక్ సంభవించినప్పుడు శాశ్వత నష్టాన్ని నిరోధించడం కోసం సకాలంలో చికిత్స చేయడం అవసరం.
స్ట్రోక్ రావడానికి గల కారణాలు
అథెరోస్క్లైరోసిస్ అనబడే వ్యాధి స్ట్రోక్ రావడానికి కారణమవుతుంది. వయస్సు మళ్లే కొద్ది స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ధూమపానం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం, ఇష్టానుసారంగా మత్తు పానీయాల వినియోగించడం, హైపర్ టెన్షన్, ఏట్రియల్ ఫిబ్రిలిఏషన్, అధిక కొలెస్ట్రాల్ స్థాయులు, ఊబకాయం, జన్యుపరమైన నిర్మాణంతో పాటు మానసిక సమస్యలు కూడా స్ట్రోక్‌కు కారణమవుతాయి. ఆడవారితో పోలిస్తే మగవారిలో ఎక్కువగా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడం ద్వారా స్ట్రోక్ రాకుండా జాగ్రత్త పడొచ్చు.
స్ట్రోక్ లక్షణాలు
– అకస్మాత్తుగా ముఖం, చేయి, కాలులో తిమ్మిర్లు లేదా బలహీనంగా అనిపించడం
– అకస్మాత్తుగా మాట్లాడటంలో ఇబ్బంది, విషయాలు అర్థం చేసుకోలేకపోవడం
– ఒకటి లేదా రెండు కంటి చూపుల్లో ఇబ్బందులు ఏర్పడటం
– నడవడానికి ఇబ్బంది, సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం
– ఎటువంటి కారణం లేకుండా విపరీతమైన తలనొప్పి
ఇలా స్ట్రోక్ లక్షణాలను FAST అనబడే శబ్దంతో గుర్తు పెట్టుకోవడంతో పాటూ గమనించవచ్చు.
Face (ఫేస్) – ముఖము ఒక ప్రక్కకు ఓరుగుతుండడం
Arms (చేతులు) – ఒక చేయి లేదా కాలులో బలహీనత ఏర్పడటం
Speech (మాటలు) – మాట్లాడటంలో ఇబ్బంది, సరిగ్గా మాట్లాడలేకపోవడం
Time ( టైం) – ఈ లక్షణాలు కాని కలిగి ఉంటే వెంటనే అత్యవసర సేవల వారికి కాల్ చేయాలని తెలుసుకోవడం
అకస్మాత్తుగా ఇలాంటి లక్షణాలను గమనిస్తే వీలైనంత తొందరగా వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. ఆ సమయంలో స్ట్రోక్ యూనిట్‌తో పాటు MRT, CT Scan వంటి వసతులు ఉన్న ఆస్పత్రుల్లోకే తీసుకెళ్లాలి.
స్ట్రోక్ వచ్చిన తర్వాత 4.5 గంటలు అత్యంత కీలకం
ప్రస్తుతం ఉన్న వైద్య పరిజ్ఞానం ప్రకారం స్ట్రోక్ వచ్చిన తర్వాత 4.5 గంటల్లోగా చికిత్స అందించడం చాలా అవసరం. ఇస్కీమిక్ స్ట్రోక్‌లు వచ్చిన సందర్భంలో లక్షణాలు కనిపించిన తర్వాత నుంచి రక్తనాళాల్లో కట్టిన గడ్డలను నిర్మూలించడానికి అవసరమైన మందు rTPA థ్రొంబోలిసిస్ ను 4.5 గంటలలోగా మాత్రమే అందించినపుడు గడ్డలను కరిగించవచ్చు. ఇలా 4.5 గంటల సమయం దాటిన తర్వాత అతి కొద్ది కేసులలో మాత్రమే ఎండో వాస్కులర్ చికిత్స(మెకానికల్ థ్రొంబెక్టమీ) 24 గంటల వరకూ అందుబాటులో ఉంటుంది. స్ట్రోక్ వచ్చినప్పటి నుంచి మొదలు ఆస్పత్రికి వెళ్లి ఎంఆర్‌ఐ స్కాన్ చేసే వరకు అన్నీ కూడా ఈ 4.5 గంటల సమయంలోపే పూర్తి అవ్వాల్సి ఉంటుంది.