జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ ర్యాలీ పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన ముఖ్యాంశాలు
అక్టోబర్ 21 హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా మురికినీరు పొంగిపొర్లుతోంది, ఎక్కడ చూసినా పరిసరాలు చెత్తాచెదారంగా మారిపోయాయి. రాత్రి పూట వీధి దీపాలు (స్ట్రీట్ లైట్లు) లేవు. గత ముఖ్యమంత్రి హైదరాబాద్‌ను సింగపూర్, వాషింగ్టన్ చేస్తానని అబద్ధాలు చెప్పేవాడు. కానీ ఇప్పుడు ఫామ్‌హౌస్‌లో ఉన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వీధి దీపాలు ఏర్పాటు చేయడంలో కూడా ఇబ్బంది పడుతోంది. ఇలాంటి ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉండేది. కానీ ఈ 12 ఏళ్లలో, రెండు ప్రభుత్వాల (పార్టీల) కారణంగా మిగులు ధనం దేవుడెరుగు… బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్ల అప్పులు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొద్ది కాలంలోనే రూ. 3 లక్షల కోట్ల అప్పులు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేక రకాల హామీలు ఇచ్చింది. మహిళలకు ఇస్తామన్న రూ. 2,500, మోటార్ సైకిళ్లు, తులం బంగారం ఏమయ్యాయి? కాంగ్రెస్ నాయకులు విపరీతమైన దోపిడీ చేస్తున్నారు. మరి వారికి జూబ్లీహిల్స్‌లో ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా? ఈ రోజు జూబ్లీహిల్స్‌లో ఏ ఒక్కరికీ పెళ్ళికి తులం బంగారం, రూ. లక్ష ఇచ్చారా? నిరుద్యోగ యువతకు ఇస్తామన్న రూ. 4,000 ఏమయ్యాయి? హామీ ఇచ్చిన 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయాయి? దీనిపై యువకులు, మహిళలు కాంగ్రెస్‌ను నిలదీయాలి. దళిత కుటుంబానికి రూ. 12 లక్షలు ఇస్తామన్నారు, ఇచ్చారా? బీసీ సంక్షేమానికి సంబంధించి కేటాయించిన లక్ష కోట్లు ఏమయ్యాయి? మహిళలు ప్రయాణించుకోవడానికి ఉచిత బస్సు మాత్రం ఇచ్చాడు. గతంలో కేసీఆర్ లాగే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా మాటలతో కోటలు కడుతున్నాడు. ఏ పార్టీ నాయకుడు ప్రజల మధ్య ఉంటాడో, వారి సమస్యలు వింటాడో వారికే ఓటు వేయాలి. నిజానికి, కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన అభ్యర్థి… మజ్లిస్ పార్టీ, అసదుద్దీన్ ఒవైసీ మద్దతు ఉన్న వ్యక్తి. మజ్లిస్ పార్టీ కబంధ హస్తాల నుండి హైదరాబాద్‌ను రక్షించుకోవాలి. నాడు కేసీఆర్ పాలనలో మజ్లిస్ పార్టీని భుజాల మీద మోశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది. ఈ మూడు పార్టీలు నిజానికి ఒక్కటే. ఈ మూడు పార్టీలు కేవలం కుటుంబ పార్టీలే, వారి స్వార్థం కోసమే పని చేస్తాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకరినొకరు పిరాయుంపులను ప్రోత్సహించుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే అది మూసీ నదిలో వేసినట్టే. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. మన ఓటుతో బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలకు బుద్ధి చెప్పాలి. దీపక్ రెడ్డి గారు ప్రజల మధ్యలో ఉండే నాయకుడు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలి.