“మా పెండింగ్ స్కాలర్‌షిప్ మాకు ఇవ్వండి!” – విద్యార్థుల ఆవేదనకు ఎదురైన ప్రభుత్వ బారికేడ్లు!
సెప్టెంబర్ 14 హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది పారామెడికల్, ఓకేషనల్ ఇంటర్ మెడికల్ విద్యార్థులు తమ పెండింగ్ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని బలంగా డిమాండ్ చేస్తున్నారు. గతంలో పలుమార్లు మంత్రులు హామీలు ఇచ్చినా, అధికారులు ఫైళ్ళను తిప్పుతున్నా – ఇప్పటి వరకు స్కాలర్‌షిప్‌లు విడుదల కాలేదు.
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులు అప్పులు తీసుకుని ఫీజులు చెల్లించారు. అయినా ప్రభుత్వం న్యాయం చేయకపోవడంతో – కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వక, ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోతున్నారు.
విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ –
“మా స్కాలర్‌షిప్‌లు మాకు ఇవ్వండి. ఇది దానం కాదు, మా హక్కు!” అని నినదిస్తున్నారు.
ఆలైడ్ హెల్త్‌కేర్ అసోసియేషన్ హెచ్చరిక
ఆలైడ్ హెల్త్‌కేర్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కురుమల్ల వంశీ ప్రసాద్ మాట్లాడుతూ:
“విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు ఆపడం అనేది వారి భవిష్యత్తును అడ్డుకోవడం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్ మొత్తాన్ని విడుదల చేయాలి. లేదంటే కఠినమైన ఉద్యమాలు చేపట్టక తప్పదు.” అని స్పష్టం చేశారు.
విద్యార్థుల స్పష్టమైన డిమాండ్లు:
తక్షణమే పెండింగ్ స్కాలర్‌షిప్ విడుదల చేయాలి.
ఆలస్యమైన ప్రతి రోజుకూ వడ్డీతో చెల్లించాలి.
స్కాలర్‌షిప్ అందక కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఉన్న పరిస్థితిని నివారించాలి.
విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం జరిగిన ప్రతి సందర్భంలో ప్రభుత్వం బాధ్యత వహించాలి.
“చదువుకు నిధులు లేవా? ఎన్నికలకు కోట్లున్నాయా?”
విద్యార్థులు విమర్శిస్తూ –
ఒకవైపు ఎన్నికల సమయంలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ, హామీల వర్షం కురిపిస్తున్న ప్రభుత్వం – మరోవైపు చిన్న మొత్తంలో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను విడుదల చేయకపోవడం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు.