తెలంగాణ కోటిలింగాల చరిత్ర తెలుసుకుందాం (శాతవాహనుల తొలి రాజధాని)
Oplus_131072
జగిత్యాల జిల్లా వెల్గటూరు (లక్సెట్టిపేట తాలూకా) మండలంలో గోదావరి నదికి కుడివైపున గల చిన్న గ్రామం కోటి లింగాల. ఇది శాతవాహనుల తొలి రాజధానిగా అతిప్రాచీన నగరంగా పేరు 110 ఎకరాల స్థలంలో గోదావరి పెదవాగుల తీరం వెంబడి ఉన్న శాతవాహన కోట శిధిలాలలో 300మీ. పొడవు గల గోడ మాత్రమే మిగలగా అక్కడక్కడ కోటస్తంభాలు నిలబడి శాతవాహన చరిత్రకు ఆనవాళ్ళుగా నిలిచాయి. ఈ కారణంగానే కోటిలింగాలను “స్తంభాలపల్లి” అని కూడ అంటారు. శాతవాహనులతో పాటు బౌద్ధ చరిత్రకు ఈ ప్రాంతం విశిష్ట ప్రాధాన్యతను సంతరించుకున్నది.
1979-84 సం||ల మధ్య పురావస్తు శాఖ అన్వేషణ వల్ల ప్రాచీన నగరం బయటపడింది. జనావాసాలు, పారిశుద్ధ్యపు కాలువలు, మట్టి పెంకులు, ఇటుకలు, రోమన్ల అలంకృత ఘటములు, ఆభరణాలు, పూసలు ఇత్యాది వస్తు సామగ్రి మిక్కిలిగా లభించాయి. ఇప్పటికి స్థానికులకు ఈప్రాంతంలో వివిధ వస్తు విశేషాలు కనిపిస్తునే వున్నాయి. కోటిలింగాల గ్రామంలో 2.5 మీ॥ లోతులో 2500 నాటి ప్రాచీన నగరం బయట పడటమే కాదు. అమూల్యమైన నాణెములు లభించాయి. 2.5 మీ. లోతులో ‘రాణో గోబధ” పేరుతో కొన్ని నాణెములు. 1.78 మీ. లోతులో ‘రాణో సమగోప” నాణెములు, 0.38 మీ. లోతులో “శ్రీముఖుని” నాణెములు లభించాయి. ఒకటవ పులుమావి. మహాసేనాపతి సగమన, కంవాయి సిరి, మహాతలవర, సిరినారన నాణెములు ఉపరితలంలో దొరికాయి. ఇవిగాక పంచ్ మార్క్ నాణెములు, రాతలేని నాణెములు, మహారధి, మహాగ్రామిక, శివశేబక, సాధకన నాణెములు తయారు స్థితిలో ఉన్నవి.
పునర్మిత్రాలు, సగం తయారైన నాణెములు, కరగవేసినవి. బంగారు, రాగి, సీసంతో తయారు చేసినవి కూడ విరివిగా లభించడాన్ని బట్టి ఇచట శాతవాహనుల కోశాగారం, నాణెముల ముద్రణాలయం వుండేదని తెలుస్తుంది. కోటి లింగాలకు 15 కి.మీ. దూరంలో రాయపట్నం, ధర్మపురిలలో జనావాసాలు, నాణెములు బయటపడ్డాయి. నానేఘాట్ శాసనాన్ని మరియు నాణెములను బట్టి శాతవాహనుల వంశస్థాపకుడైన శ్రీముఖుడు కోటిలింగాలను రాజధానిగా చేసుకుని పాలించాడని చెప్పవచ్చు. శ్రీముఖుడు కంటే ప్రాచీనుడైన గోభద్ర, సంవాయి, సమగోప, నారన అనే వారి నాణెములు అట్టడుగు పొరలలో లభించుట చేత కోటిలింగా పాలకుడైన గోభద్రుని నుండి రాజ్యం శ్రీముఖుని వశమైనదని తెలుస్తుంది. 272 సం॥ పాటు 17 మంది శాతవాహన చక్రవర్తులు పాలన చేశారని వాయుపురాణం, 470 సం||ల పాటు 30 మంది శాతవాహన రాజులు పాలన చేశారని మత్స్య పురాణము వివరించగా రెండింటిలోను శ్రీముఖుడు ఆధ్యుడుగా నమోదయినాడు.
శెరివణిజ జాతక కథను బట్టి ” తెలివాహనామనదీం ఉత్తీర్య ఆంధ్ర పురం నామనగర ప్రవిశంతు ” (సంస్కృతీకరణం) ఔత్తరాహిక వ్యాపారి ప్రవేశించాడని చెప్పబడిన ఆంధ్రానగరం. ఇది కృష్ణానది తీర భూమి. కృష్ణానది కానాడు కణ్ణబెణ్ణా నది యని పేరు. బౌద్ధ వాజ్మయంలో కణ్ణ బెణ్ణ, తేలివాహనదులు కృష్ణా, గోదావరికి గల ప్రాచీన నామములు. దీనిని బట్టి శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల, ద్వితీయ రాజధాని పైఠాను, తృతీయ (అంతిమ రాజధాని ధాన్యకటకం. మహాభారతం కాలం నాటికి “ఆంధ్రక: కృష్ణా వర్యో: మధ్యే విద్య మానే దేశ. ” అని చెప్పడాన్ని బట్టి గోదావరి తీరం నుండి కృష్ణానదీ తీరమునకు ఆంధ్రరాజ్యం విస్తరించినది. క్రీ.శ. 3వ శతాబ్దాకి చెందిన కాంచీపుర శివస్కంద వర్మ అనే పల్లవ రాజు ధాన్యకటకం ఆంధ్రాపదంలోని దని చెప్పడం వల్ల శాతవాహనులు తృతీయ రాజధానిగా ధాన్యకటకాన్ని చెప్పవచ్చు.
శెరవణిజ జాతక కథను బట్టి కోటిలింగాల తొలినాటి వ్యాపార కేంద్రం. రోమన్ల నాణెములు, వస్తువులు ఇచట లభించాయి. కోటిలింగాల సమీప ప్రాంతం, కరీంనగర్ జిల్లాలోని మస్తులాపూర్లో 1952లో జరిపిన తవ్వకాల యందు ఒకటవ శతాబ్దికి చెందిన 39 రోమన్ నాణెములు వెండివి లభించాయి. ఇవి నీరో, ఆగస్టున్ చక్రవర్తుల కాలం నాటివి. రాజపట్నం రేవు, ధర్మపురి రేవు, వెంకట్రావు పేట రేవు, పోతలి ప్రాంతాలు ప్రముఖ వ్యాపార తీర ప్రాంతాలు. భిక్షువులకు ఆరాధనా స్థలమిది. ఆంధ్రాపదానికి వచ్చే ఉత్తర భారత దేశ వ్యాపారులకు, తైర్థికులకు, భిక్కువులకు వాకిలి ద్వారమిది. విదర్భను ఆంధ్రదేశాన్ని కలిపే మహాపదము గోదావరిని ఇచట దాటి ఆంధ్రరాజ్యములో ప్రవేశించెడిది.
గౌతమబుద్ధుని ముఖ్య శిష్యుడైన మహా కాత్స్యాయనుడు అస్సక ప్రాంతపు రాజులకు బౌద్ధ ధర్మాన్ని బోధించాడని విమానవత్తు అనే గ్రంధం చెప్పబడినది. అస్సక, ములక జనపదాలు దక్షిణాపదంలో వున్నాయని సుత్తనిపాత పేర్కొన్నది. పోతల రాజధానిగా (నిజామాబాద్) ఉన్న అస్సక ప్రాంతం నేడు ఆదిలాబాద్, కరీంనగర్, నిజమాబాద్ జిల్లాలుగా గుర్తించారు. మరియు అస్సక దేశం ‘కవిత’ వనంలో ఉన్నట్లు జాతక కథలలో చెప్పబడినది. కవిత అనగా వెలగ అని అర్ధం. కోటిలింగాలకు సమీపంలోని వెలగటూరు వున్నది. దీనిని బట్టి ఆంధ్రదేశంలో బుద్ధుని ధర్మాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టి “ బావరి” నివాస స్థలం కోటిలింగాల అలాగే బుద్ధ ఘోషుని ‘పరమార్థజ్యోతిక” అనే గ్రంధంలో బావరి నివాసస్థలం “కవిట వన ద్వీపం” అని చెప్పబడినది.
బౌద్ధ స్థూపము : కోటిలింగాల గ్రామానికి ఆగ్నేయదిశలో గోదావరి పెదవాగు కలిసే చోట తవ్వకాలలో మహాస్థూపం బయటపడినది. ఇటుకల నిర్మించిన ఈ స్థూపం చాలావరకు శిధిలమైపోయింది. స్థూపానికి చుట్టూ అలంకారానికి అతికించిన 20 సెం.మీ. మందం గల చలువరాతి ఫలకాలు 59 లభించాయి. వీటిపై గల లఘు శాసనాలు పూర్వ బాహ్మీలిపికి చెందినవి. మౌర్య బ్రాహ్మీలిపికి, భట్టిప్రోలు బ్రాహ్మీలిపికి పూర్వలిపిగా వీటిని గుర్తించారు. అంటే అశోకుని కంటే ముందు గానే స్థూప నిర్మాణం జరిగింది. క్రీ.శ. 4వ శతాబ్దిలో దీనిని పునరుద్ధరించారు. థేర వాదానికి చెందిన ఈ స్థూప చలువ రాతి ఫలకాలపై ఈ విధంగా శాసనాలు వేయించారు.
- మాయించ సదా ఏచ్చ మయేన (భూమిలో ఎల్లపుడు కోరిక నిండుకుని వుంది)
- యే సదోయించ క్షేస సదామనే ( ఇవి రెండు కళ్ళను నాశనం చేస్తాయి. )
- పుంఖేమ సదాదమ ఏచ్ఛయీ పుద శమకోద (డేగవలె ఎల్లపుడు ధర్మాన్ని ఈకోరికయే తగ్గిస్తుంది.)
- ఏచ సదా ఖిద కస ఖరమ దయీమ్ (ఇది కష్టాలను ఎల్లవేళల క్రమంగా ఇస్తుంది.)
- సదా లీ క్షమే పుత(ర) ఏపు పోట సమయే పుందయీ ఏప్పద (ఎల్లపుడు క్షేమాన్ని, పుత్రులను, తేజస్సు యొక్క పుత్రుని దగ్గరలో ఉన్ననూ దహిస్తుంది.
- క్షేమద ఏ సద యీ ఏచ్ఛ క్షేస దసయా చిచేధస (ఇది నిజమైతే క్షేమాన్ని కోరి, కోరికను వివిధ దశలలో చేధించాలి.)
- మయీం (భూమిలో)
- నాగ గోప నికాయ ( నాగగోపుడు బౌద్ధుల సమావేశపు మందిరాన్ని నిర్మించిధానమొసంగినవి)
- నసా ధాన (ఛత్రాన్ని ధానం చేసెను)
బౌద్ధ స్థూపానికి చేరువలో పడమటి వైపు 20 అడుగుల ఎత్తులో గల పెద్ద దిబ్బ వున్నది. ఇది కూడ బౌద్ధ స్థూపమే దీనిపై త్రికూటాలయం పేరుతో శివాలయం నిర్మించగా అది వరదలకు నాశనమై శివలింగాలుగా పేర్కొనే స్థూపమే మిగిలింది. ఇక చైత్యాలు, నివాస గృహలు, సమావేశ మందిరాలు కేవలం ప్రాథమికంగానే వున్నాయి.
సేకరణ