మహిళాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)
ఆగస్టు 17 వికారాబాద్: మహిళాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. ఆగస్టు 16న చించల్ పేట్ గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల శాసనసభ్యులు కాలె యాదయ్య తో కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు గావించారు.
వికారాబాద్ జిల్లా, చేవెళ్ల నియోజకవర్గం నవాబు పేట్ మండలంలోని చించల్ పేట్ గ్రామంలో 15 లక్షలతో అంగన్వాడి భవనం, 20 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్, 20 లక్షలతో పశు వైద్య ఉపకేంద్ర భవనం, 20 లక్షలతో డ్వాక్రా భవనం, 30లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్, 20 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవనం, 20 లక్షలతో గ్రామపంచాయతీ భవనాలను అతిధులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో పంచాయత్ రా శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని ఆమె అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, వడ్డీ లేని రుణాలు, క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం దోహదం చేస్తుందన్నారు. మహిళలందరిని సంఘాల్లో చేర్పించాలని, సంఘాల్లో ఉన్నవారికి రుణాలు పొందే అవకాశం ఉంటుందని, ఇప్పటికే మహిళా సంఘాలకు 26 వేల కోట్ల అప్పులు ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు. 800 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగిందని ఆమె అన్నారు. మహిళా సంఘాల్లో ఉన్న మహిళలు రుణాలు పొంది మరణించినట్లయితే 2 లక్షల లోన్ బీమా చేయించడం జరుగుతుందని ఆమె తెలిపారు. మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయని ఆమె అన్నారు. 15 సంవత్సరాల వారికి మహిళా సంఘాల్లో సభ్యత్వం కల్పించడం జరుగుతుందని అదేవిధంగా 60 సంవత్సరాలు దాటిన మహిళలకు కూడా సంఘాల్లో చోటు కల్పించడం జరుగుతుందని ఆమె అన్నారు. 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందజేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ , మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ... చించలపేట గ్రామంలో పెద్ద మొత్తంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. శాఖ పరమైన ప్రజలకు సేవ చేసేందుకు నా వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.