December 24, 2025

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఏఐజీ (AIG) నెలకొల్పిన నూతన ఆసుపత్రిని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి

0
IMG-20250702-WA2102

కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు ఏడాదిలో కనీసం ఒక నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలకు సేవలు అందించే ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. ఒక సామాజిక బాధ్యతగా సామాన్య ప్రజలకు సేవలు అందించడం వల్ల వైద్య వృత్తిలో గొప్ప అనుభూతి, ఆత్మ సంతృప్తి లభిస్తుందని అన్నారు.హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఏఐజీ (AIG) నెలకొల్పిన నూతన ఆసుపత్రిని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కార్పొరేట్ రంగంలో ఉన్న వైద్యులు ప్రభుత్వ సేవలు అందించాలంటే అనుసంధానం చేయడానికి వీలుగా ఇప్పటివరకు సరైన వేదిక లేదని, అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించినట్టు చెప్పారు. “అమెరికాలో స్థిరపడిన మన రాష్ట్రానికి చెందిన డాక్టర్లు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు వారు సేవలు అందించాలంటే అందుకు తగిన ప్లాట్‌ఫామ్ ఏదీ లేదు. వారిక్కడ ఉన్న సమయంలో వారి సేవలు అందించాలనుకుంటే అందుకు అనుగుణంగా ఒక వేదిక ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించాం. ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే ప్రాణాలు పోతాయన్న అభిప్రాయం నుంచి దూరం చేయాలన్న ఆలోచనతో కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ రంగంలో వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. అందులో భాగంగానే వందేళ్ల ఉస్మానియా ఆసుపత్రికి 30 ఎకరాల స్థలం కేటాయించి 3 వేల కోట్లతో కొత్త ఆసుపత్రి నిర్మిస్తున్నాం. నిమ్స్‌లో మరో 2 వేల పడకల విభాగం ప్రారంభించబోతున్నాం. అలాగే వరంగల్, అల్వాల్, ఎల్‌బీ నగర్, సనత్‌నగర్ తదితర ప్రాంతాల్లో కార్పొరేట్‌కు దీటుగా రాష్ట్రంలో 7 వేల పడకలతో ఆసుపత్రులను వచ్చే డిసెంబర్ 9 నాటికి అందుబాటులోకి తేవాలని నిర్ధేశించాం. పెరిగిన వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకుని అధికారం చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 2 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం. దాంతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద ఇప్పటివరకు 14 వందల కోట్లు ఖర్చు చేశాం. నిరుపేదలకు వీలైనంత వరకు విద్య, వైద్యం అందించాలన్న ఆలోచనతో ఆ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. బడ్జెట్‌లో వైద్య రంగానికి 11,500 కోట్లు, విద్యకు 21 వేల కోట్లు కేటాయించాం.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed