December 24, 2025

రాంరెడ్డి దామోదర్ రెడ్డి (1952 – 2025)( సీనియర్ కాంగ్రెస్ నాయకుడు- ప్రజల మనిషి)

0
IMG-20251008-WA1216


అక్టోబర్ 9 సూర్యాపేట: వ్యాసకర్త: డా. తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి
ప్రజలను,కార్యకర్తలను, నియోజకవర్గాన్ని, కుటుంబంగా భావించిన టైగర్ దామన్న రాంరెడ్డి దామోదర్ రెడ్డి! గురించి తెలుసుకుందాం.

*వివరాలు*:ఉమ్మడి ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాత లింగాల గ్రామానికి చెందిన రాంరెడ్డి నారాయణరెడ్డి-కమలమ్మ దంపతులకు 1952 సెప్టెంబరు 14న దామోదర్‌రెడ్డి జన్మించాడు. వీరిది భూస్వామ్య వ్యవసాయ కుటుంబం. రెండు గ్రామాల్లో కలిపి నారాయణరెడ్డి 1500 ఎకరాల భూస్వామి. వీటిలో 750 ఎకరాలు ఖమ్మం గిరిజనులకు ఇవ్వడం జరిగింది.

తల్లి కమలమ్మ ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన దేశ్ముఖ్ కుటుంబం కోడూరి వారి ఆడపడుచు. దామోదర్ రెడ్డి వాళ్లు మొత్తం ఎనిమిది మంది తోబుట్టువులు. వీరిలో నలుగురు అన్నాదమ్ముళ్లు. నలుగురు అక్కాచెల్లెళ్ళు. వీళ్ళు వరుసగా జానకీదేవి, సుగుణాదేవి,రాంరెడ్డి వెంకటరెడ్డి( మాజీ మంత్రి),గోపాల్ రెడ్డి, జయప్రదా దేవి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, విజితాదేవి, కృష్ణారెడ్డి. వీరిలో వెంకటరెడ్డి – దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో నిబద్ధత కలిగిన నాయకులుగా ప్రజా బంధువులుగా పేరు గడించారు.

దామోదర్ రెడ్డి తండ్రి నారాయణరెడ్డి, తాత, ఇద్దరూ కూడా స్వాతంత్ర సమరయోధులే. ఈ విధంగా మొదటి నుండి కూడా వీరి కుటుంబానికి రాజకీయ చరిత్ర ఉన్నది.

దామోదర్ రెడ్డి ప్రాథమిక విద్యను స్వగ్రామంలోనే కొనసాగించాడు., హైస్కూల్ విద్యను హైదరాబాద్ వివేకవర్ధని పాఠశాలలో పూర్తి చేశాడు. తర్వాత వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి 1973 లో బిఎస్సి డిగ్రీ పొందాడు.

కళాశాల రోజుల నుండి నాయకత్వ లక్షణాలతో చలామణి అయ్యాడు . కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ ఆడేవాడు. కళాశాల విద్యార్థి నాయకులుగా వీరి సోదరులు రాంరెడ్డి వెంకటరెడ్డి, గోపాల్ రెడ్డి, కొనసాగే వారు. దామోదర్ రెడ్డి కూడా అదే బాటలో కొనసాగాడు. ఈ సోదరులకు స్థానిక రాజకీయ నాయకుల అండదండలు ఆ కాలంలోనే ఉండేవి.

▪️జై తెలంగాణ నినాదంతో

విద్యార్థిగా 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు. 1971లో జై ఆంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా జై తెలంగాణ అంటూ మరోసారి జైలుకు వెళ్లాడు.
తర్వాత కాలంలో శాసన సభ్యుడిగా 1989 నుండి 1999 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో బలమైన తెలంగాణ వాదాన్ని వినిపించిన ఘనత దామోదర్ రెడ్డికి దక్కుతుంది.

▪️ఆలయ కమిటీ చైర్మన్గా

శాసన సభ్యుడిగా కొనసాగడానికి ముందు, తమ పూర్వీకులు నిర్మించిన తుంగతుర్తి పట్టాభి రామచంద్రస్వామి ఆలయానికి ఛైర్మన్గా వ్యవహరించాడు. ఈ ఆలయానికి 400 సంవత్సరాల చరిత్ర ఉన్నది.

▪️రాజకీయ ప్రస్థానం

పుట్టింది పెరిగింది ఖమ్మం జిల్లా అయినప్పటికీ, వివాహం తరువాత నల్గొండ జిల్లాలో స్థిరపడి, అక్కడే రాజకీయంగా ప్రస్థానం మొదలెట్టాడు. యువజన నాయకుడుగా కాంగ్రెస్ పార్టీలో చేరి, వి.హనుమంతరావు నాయకత్వంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కోశాధికారిగా నియమించబడ్డాడు. కేసీఆర్, చంద్రబాబునాయుడు, దామోదర్ రెడ్డిలు యువజన కాంగ్రెస్ లో కలిసి పనిచేశారు.సామాన్య కార్యకర్త స్థాయి నుండి రాష్ట్ర మంత్రి వరకు ఎదిగిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి తన జీవిత కాలంలో ఐదు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. రాష్ట్ర మంత్రిగా కొనసాగాడు. తన జీవితకాలం మొత్తం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పని చేశాడు.

|| శాసనసభ్యుడిగా ||

తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఐదుసార్లు పోటీ చేసి నాలుగు సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందాడు.
కమ్యూనిస్టు యోధులు భీమ్రెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం గెలుపొందిన కమ్యూనిస్టుల కంచుకోట తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం దామోదర్ రెడ్డి రాజకీయ ప్రభంజనానికి మచ్చుతునక.

1 )1985 ఎన్నికల్లో సాయుధ పోరాట యోధురాలు సీపీఎం నాయకురాలు మల్లు స్వరాజ్యాన్ని ఓడించడం
తిరుగులేని చరిత్ర. అట్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి దామోదర్ రెడ్డి బీజం వేశాడు.
2) 1989 ఎన్నికల్లో కూడా విజయంతో చరిత్రను పునరావృతం చేశాడు
3) 1994 ఎన్నికల్లో లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందాడు. ఇది దామోదర్ రెడ్డి వ్యక్తిగత చరిష్మాకు గీటురాయి.
4)1999లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి, కొన్ని వ్యతిరేక శక్తుల కారణంగా ఓటమి పాలయ్యాడు.
5) 2004లో అదే తుంగతుర్తి నుండి విజయం సాధించాడు.
6) నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో సూర్యాపేటకు మారారు. 2009 ఎన్నికల్లో సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు..
7) 2014,2019, 2024, ఎన్నికల్లో ఓటమిపాలయ్యాడు. బలమైన తెలంగాణ వాదం వినిపించినప్పటికీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో శాసనసభలోకి అడుగుపెట్టలేకపోయాడు. ఇది దామోదర్ రెడ్డి గారికి కొంత నిరాశను మిగిల్చిన అంశం.

|| మంత్రిగా||

1991 – 1992 మధ్య కాలంలో నేదురిమిల్లి జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర భూగర్భజలవనరుల శాఖ మంత్రిగా పని చేశాడు
2008 – 2009 మధ్యకాలంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా పని చేశాడు.

|| కాంగ్రెస్ వాదిగా ||

ఎన్టీ రామారావు నుండి, చంద్రబాబు నాయుడు నుండి, కల్వకుంట్ల చంద్రశేఖర రావు నుండి, తమ పార్టీలో చేరడానికి ఆహ్వానాలు అందినప్పటికీ… దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడలేదు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, తాను గెలిచినా ఓడినా, పార్టీ నుండి తనకు సీటు వచ్చినా రాకపోయినా, నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి జీవిత కాలం కాంగ్రెస్ వాదిగానే ఉండిపోయాడు.

▪️గోదావరి జలాల సాధన

వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తుంగతుర్తి ప్రాంత ప్రజలకు.. రైతులకు…శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను సాధించుట దామోదర్ రెడ్డి రాజకీయ చరిత్రలో కీలకమైనది.. వెలిశాల వద్ద గోదావరి జలాలకు పూజలు నిర్వహించిన చరిత్ర
స్మరణీయమైనది.

▪️ భీమ్రెడ్డి నరసింహారెడ్డి -మల్లు స్వరాజ్యంల ప్రశంస

తుంగతుర్తి నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నరాంరెడ్డి దామోదర్ రెడ్డి గారిని, అదే తుంగతుర్తి నియోజకవర్గానికి పూర్వ శాసనసభ్యులుగా పనిచేసిన భీంరెడ్డి నరసింహారెడ్డి , మల్లు స్వరాజ్యం, ఇద్దరు కూడా “మా కంటే బాగా పనిచేస్తున్నావు” అని ప్రశంసించారు. ఈ విషయాన్ని దామోదర్ రెడ్డి గారి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. ఈ విధంగా సిద్ధాంత విభేదాలు ఉన్నప్పటికీ అభివృద్ధి విషయంలో ఇరువురు పరస్పరం గౌరవించుకున్నారు .

▪️ టైగర్ దామన్నగా సవాళ్లను ఎదుర్కొంటూ…

ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నాను అని భరోసా ఇచ్చే రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ప్రజల గుండెల్లో టైగర్ దామన్నగా మిగిలిపోయాడు. కార్యకర్తలకు, నమ్మిన ప్రజలకు, దామోదర్ రెడ్డి అంటే ఒక నమ్మకం. ధైర్యం , తెగింపు, అతడికి మారు పేర్లు.

రాజకీయ పార్టీల పేరుతో రెచ్చిపోతూ….తుంగతుర్తిని బాంబుల మోతతో ఫ్యాక్షన్ కేంద్రంగా తయారు చేస్తున్న వర్గాలకు దామోదర్ రెడ్డి ఒక సింహస్వప్నంగా మారిపోయాడు.

కమ్యూనిస్టుల అండదండలతో నక్సలైట్లు దామోదర్ రెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు… ఇబ్బందులు పెట్టారు… కానీ దామోదర్ రెడ్డి ఎక్కడ కూడా భయపడలేదు . తనదైన యుక్తితో వ్యవహరిస్తూ నక్సలైట్లలో కొందరిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడం జరిగింది.

రాజకీయ విభేదాల కారణంగా అనేక మంది శత్రువులను కూడా ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో దామోదర్ రెడ్డి ఇంట్లో బాంబు పేలిన సంఘటన కూడా ఉన్నది. ఆ సమయంలో దామోదర్ రెడ్డి తన కుమారుడితో కలిసి ఓ కార్యకర్త చావుకు వెళ్లడం మూలాన, పెద్ద ప్రమాదం తప్పింది. ఈ విధంగా ఇంటిదాకా రహస్యంగా చొచ్చుకు వచ్చి పన్నాగం వేసిన శత్రువులను చూసి కూడా దామోదర్ రెడ్డి
ఎక్కడ వెనకడుగు వేయలేదు . ప్రమాదం అంచుల్లోకి చేరిన రాజకీయ జీవితాన్ని సవాల్ గా స్వీకరించి ముందుకు నడిచాడు.

ఇన్ని వ్యవహారాల నేపథ్యంలో దామోదర్ రెడ్డి
“టైగర్ దామన్నగా “గుర్తింపు పొందాడు.

▪️ కుటుంబం

తుంగతుర్తికి చెందిన పదహారు గ్రామాల దేశ్ముఖ్ ఉప్పునూతల సర్వోత్తంరెడ్డి – కౌసల్యాదేవిల కుమార్తె వరూధినీదేవితో దామోదర్ రెడ్డి వివాహం జరిగింది. వివాహం తర్వాత దామోదర్ రెడ్డి లింగాల గ్రామంలో నుండి తుంగతుర్తి వచ్చి స్థిరపడ్డాడు. ఈ దంపతుల కుమారుడు సర్వోత్తమ్‌రెడ్డి. వరూధినీదేవి ఇది వరకే కాలధర్మం చెందారు.

దేశ్ముఖ్ ఉప్పునూతల సర్వోత్తంరెడ్డి అధీనంలో ఉన్న భూముల్లో 400 ఎకరాలు, 750 ఎకరాలు, ఆలయాలకు మాన్యాలుగా రాసిచ్చారు. కొన్ని భూముల్ని తక్కువ ధరలకు విక్రయించారు. వేల ఎకరాలను ఉచితంగా పంచి ఇచ్చారు.

▪️అభిరుచులు

రాంరెడ్డి దామోదర్ రెడ్డికి వ్యవసాయంపై, పశువుల పెంపకంపై ఎక్కువగా ఆసక్తి ఉండేది. రాజకీయాల్లో తీరిక లేకుండా కొనసాగుతున్నప్పటికీ వ్యవసాయం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవాడు..అట్లాగే పెట్స్, జీపులు, గన్స్ పైన … వాటి సేకరణ పైన ప్రత్యేక ఆసక్తి కనబరిచేవాడు . వన్యప్రాణి సంరక్షణ చట్టానికి ముందు అడవి జంతువుల్ని వేటాడటంలో మక్కువ కలిగి ఉండేవాడు..

▪️కాలధర్మం

ఒకటే జెండా…
ఒకటే మాట…

ఆదర్శానికి నినాదంగా నిలబడిన దామోదర్ రెడ్డి, గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ 73 ఏళ్ల వయసులో హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో అక్టోబర్ 1 వ తేదీ, 2025న తుది శ్వాస వదిలారు. తనకు ఎంతో ఇష్టమైన తుంగతుర్తిలోని వ్యవసాయ క్షేత్రంలో వారికి అంతిమ సంస్కారాలు జరిగాయి.

ఆధారం :
స్థానిక దిన పత్రికలు, వెబ్సైట్లు, సోషల్ మీడియాలో కథనాలు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed