February 22, 2026

మేడారం జాతర భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేబినెట్ మంత్రులు, డిజిపి

0
IMG-20260119-WA0052

మేడారం జనవరి 19: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క క్యాబినెట్ మంత్రులు, డిజిపి శ్రీ బి శివధర్ రెడ్డి లతో ఆదివారం నాడు ములుగు జిల్లాలోని మేడారం లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఆసియాలోనే అతిపెద్ద వేడుకగా గుర్తింపు పొందిన ఈ జాతర జనవరి 28 నుండి 31 వరకు జరగనుంది. జనవరి 28న సారలమ్మ అమ్మవారి రాకతో ప్రారంభమై, 29న సమ్మక్క అమ్మవారి ఆగమనం, 30న మొక్కుల చెల్లింపులు, మరియు 31న దేవతల వనప్రవేశంతో ఈ మహా జాతర ముగుస్తుంది. లక్షలాదిమంది భక్తులు వస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం ఏర్పాటు చేసిన 18 సమన్వయ కమిటీల పనితీరును మరియు పోలీస్ శాఖ చేపట్టిన భారీ బందోబస్తు ఏర్పాట్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. ముఖ్యమంత్రి ,కేబినెట్ మంత్రులు మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ బి శివధర్ రెడ్డి కూడా మేడారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి, అక్కడ 450 పైగా ఏర్పాటు చేసిన సీసీటీవీ నిఘా వ్యవస్థను పరిశీలించారు. ఈ కెమెరాలు హైదరాబాద్‌లోని ‘తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్’ కు అనుసంధానించబడి, 24/7 నిరంతర నిఘా ఉంచుతాయని అధికారులు వివరించారు.
‘మేడారం 2.0’లో భాగంగా ప్రవేశపెట్టిన అత్యాధునిక ‘టీజీ-క్వెస్ట్’ అనే కృత్రిమ మేధ ఆధారిత డ్రోన్ పోలీసింగ్ వ్యవస్థ పనితీరును ముఖ్యమంత్రికి సవివరంగా అధికారులు వివరించారు. ఈ సాంకేతికత డ్రోన్ నిఘా, కృత్రిమ మేధస్సు మరియు రియల్-టైమ్ అనలిటిక్స్‌ను కలిపి రూపొందించిన ఒక శక్తిమంతమైన వ్యవస్థ అని పేర్కొన్నారు. సుమారు 30 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న దట్టమైన అటవీ ప్రాంతం, ఫోర్ లైన్ రోడ్లు, మరియు జంపన్న వాగు వంటి అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షించడం కోసం ఈ ఏఐ సాంకేతికతను వాడుతున్నామని తెలిపారు. ఈ టీజీ-క్వెస్ట్ డ్రోన్లు ఒక ‘డిజిటల్ బీట్ ఆఫీసర్’గా వ్యవహరిస్తూ, పోలీస్ అధికారులకు ప్రత్యక్ష సమాచారాన్ని అందిస్తాయని వివరించారు. జాతర కోసం మొత్తం 13,000 పైగా పోలీస్ సిబ్బందిని 7 రోజుల పాటు మోహరించామని, ఈ బలగాలను డీ-సెంట్రలైజ్డ్ పద్ధతిలో మోహరించినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రికి భద్రతా పరమైన సవాళ్ల గురించి వివరిస్తూ, రద్దీ పెరగడం వల్ల కలిగే తొక్కిసలాట ముప్పును నివారించడానికి డ్రోన్లతో పాటు హీలియం బెలూన్లకు అమర్చిన పాన్-టిల్ట్-జూమ్ (పి టి జెడ్) కెమెరాలను వాడుతున్నట్లు తెలియజేశారు. నేర నిరోధక చర్యల్లో భాగంగా ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతను ఉపయోగించి పాత నేరస్తులను గుర్తిస్తామని, అలాగే అనుమానాస్పద వస్తువులను ఏఐ ద్వారా పసిగట్టి రియల్-టైమ్ అలర్ట్స్ పంపిస్తామని వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం 12 ప్రత్యేక క్రైమ్ టీమ్‌లను (ఒక్కో టీమ్‌లో ఒక ఎస్ఐ మరియు నలుగురు పీసీలు) నియమించామని, అలాగే పార్కింగ్ మరియు ఇతర ప్రాంతాల్లో సమర్థవంతమైన నిఘా కోసం బైక్ పెట్రోలింగ్ యూనిట్లను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. భక్తుల ఫిర్యాదుల కోసం 24/7 పోలీస్ హెల్ప్ డెస్క్‌లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ట్రాఫిక్ మరియు రవాణా నిర్వహణ గురించి చర్చిస్తూ, జాతర ట్రాఫిక్ బందోబస్తును 20 సెక్టార్లుగా విభజించి ఒక్కో సెక్టార్‌ను డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నారని వివరించారు. భక్తుల రవాణా కోసం ఆర్టీసీ ద్వారా 3800 పైగా బస్సులను నడుపుతున్నామని, వీటి ద్వారా సుమారు 20 లక్షల మంది భక్తులు ప్రయాణించే అవకాశం ఉందని తెలిపారు. వాహనాల పార్కింగ్ కోసం దాదాపు 2000 ఎకరాల విస్తీర్ణంలో 37 పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేశామని, వీటికి స్మార్ట్ అనలిటిక్స్ మరియు ఏఎన్పీఆర్ (ఎ ఎన్ పి ఆర్) వ్యవస్థను అనుసంధానం చేశామని చెప్పారు. సమాచార వ్యవస్థ కోసం 200 కిలోమీటర్ల పరిధిలో 30 రిపీటర్ స్టేషన్లను మరియు భక్తులకు మార్గనిర్దేశం చేయడానికి 50 పైగా పబ్లిక్ అడ్రస్ అనౌన్స్‌మెంట్ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

చిన్నారులు మరియు వృద్ధుల భద్రత కోసం వోడాఫోన్ సహకారంతో ప్రవేశపెట్టిన ‘చిల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్’ (సి టి ఎం ఎస్) గురించి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. జాతరలో తప్పిపోయే అవకాశం ఉన్న వారికి క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ రిస్ట్ బ్యాండ్‌లను అందజేస్తారని, వాటిని స్కాన్ చేయడం ద్వారా తప్పిపోయిన వారిని త్వరగా కుటుంబ సభ్యులతో చేర్చవచ్చని అధికారులు వివరించారు. ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్ నాథ్ బందోబస్తు ఏర్పాట్ల గురించి వివరించగా ఇంటెలిజెన్స్ అడిషనల్ డిజిపి శ్రీ విజయ్ కుమార్, ఐ జి పి శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed