మామునూరు ఎయిర్ పోర్టుకి నిధులిచ్చినందుకు సీఎం రేవంతన్నకు థ్యాంక్స్. ఇది వరంగల్ ప్రాంత దిశను మార్చేసే ప్రాజెక్టు.రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పష్టీకరణ
జూలై 25 హైదరాబాద్: వరంగల్ ప్రాంత దిశదశను మార్చేసే మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణ పనులకి అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయగా… అందుకు కృషి చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకి… రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ధన్యవాదాలు తెలిపారు. రూ.205 కోట్ల నిధులు విడుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి భూములిస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.కోటి 20 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించినట్టు వివరించారు. అలాగే ప్లాట్లకు, ఇళ్లకు సైతం న్యాయమైన పరిహారం చెల్లించేందుకు ప్రతిపాదించారు. గత నెల రోజులుగా భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో తాము జిల్లా ఇంఛార్జీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జిల్లాకి చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కృషి చేస్తున్నట్టు వివరించారు. కేరళలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం మాదిరిగా మామునూరు ఉండాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు వివరించారు. సుమారు 1,000 ఎకరాల్లో నిర్మించనున్నట్టు చెప్పారు. ఎయిర్ పోర్టు పూర్తయితే, మామునూరు విమానాశ్రయం ప్రారంభమైతే చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి అక్కడికి వెళ్లే రహదారుల వెంట అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనేక పరిశ్రమలు వస్తాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి సురేఖ ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో కూడా పర్యాటకం అభివృద్ధి చెందుతుందన్నారు.