ప్రజల కోసం జీవితాలను త్యాగం చేసిన మహనీయులు (లీలమ్మ)
లీలమ్మ అనగానే అప్పటి తరానికి ఆమె చప్పున గుర్తుకొస్తారు..
నేటి తరంలో కొందరికి లీలగా జ్ఞప్తినిస్తారు.
కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య జీవన సహచరి ఆమె..ఆయన ఆశయం వెనుక ప్రజ్వలించే జ్యోతి ఆమె.ఆయన ప్రతి అడుగులో,శ్వాసలో ఆమె అణువణువునా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
మొక్కలంటే అమితమైన ప్రేమ
లీలమ్మకి మొక్కలంటే చాలా ఇష్టం.సుందరయ్య గారికి ఇష్టమని ఆయన గది కిటికీ దగ్గర రెండు సన్నజాజి తీగలు పెంచారు.ఆయన చదువుకునేప్పుడు ఆ పూల పరిమళాలు వస్తే బాగుంటుదని అలా పెంచానని చెప్తుండేవాళ్లు. ఆమెకు చమేలీ పూలు అంటే చాలా ఇష్టం.
రాత్రివేళ తన తలగడ దగ్గర వాటిని పెట్టుకుని నిద్రపోయేవారు.
మంచి అలవాట్లు
ఆమె వంట చేసేటప్పుడు సుందరయ్యగారిపై రాసిన పాటలను వింటుండేవారు. ఎవరితోనూ తన బాధను పంచుకోవడానికి ఇష్టపడేవారు కాదు.
అవతలి వాళ్లు తన వల్ల బాధ పడకూడదని అనుకునేవారు.
పీడిత ప్రజల అభ్యున్నతికి వారిద్దరూ అహరహం పనిచేశారు.వారి త్యాగం అసామాన్యం.వారు పిల్లల్ని వద్దనుకుని,పీడిత ప్రజలందరూ తమ బిడ్డలే అని భావించారు.పార్టీ శ్రేణులకు ఆమె మాతృమూర్తి.1985లో సుందరయ్య కన్నుమూశాక ఆమె దగ్గర శివకుమారి దంపతులు ఉండాలని పార్టీ నిర్ణయించింది.
పుస్తకాలంటే అపురూపం
లీలమ్మ ప్రతి ఆరునెలలకు ఒకసారి పుస్తకాలన్నీ సర్దాలనేవాళ్లు.
ఆ పుస్తకాలు సర్దే రోజుల్లో ఉదయమే టిఫిన్,వంట చేసేసుకునేవాళ్లం.ఉదయం 8.30 గంటల నుంచి 12 గంటల వరకూ సర్దేవాళ్లం.ఆమె పుస్తకాల క్రమం తప్పకుండా సర్దేవారు.ఎక్కడ ఏ పుస్తకం ఉందో ఆమెకు బాగా గుర్తు.చీకట్లో సైతం కావాల్సిన పుస్తకాన్ని తీయగలరు.