December 24, 2025

దొరల గుండెల్లో బడబాగ్ని ఐలమ్మ: నేడు చాకలి ఐలమ్మ జయంతి

0
IMG-20250926-WA1635

సెప్టెంబర్ 26, హైదరాబాద్:”ఈ భూమినాది… పండించిన పంట నాది… తీసుకెళ్లడానికి దొరెవ్వడు…నా ప్రాణం పోయాకే ఈపంట, భూమి దక్కించుకోగలరు” అంటూ మాటల్ని తూటాలుగా మల్చి దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన వీరనారి చిట్యాల ఐలమ్మ. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మడమతిప్పని పోరాట యోధురాలు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పాలకుర్తిలో పేద కుటుంబంలో ఐలమ్మ 1895 సెప్టెంబర్‌ 26న జన్మించింది. ఆమెకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. రజక కులవృత్తినే జీవనాధారంగా చేసుకుని బతికేది. 1940-44 కాలంలో విసునూర్‌ దేశ్‌ముఖ్‌, రజాకార్ల అరాచకాలు పెట్రేగిపోయాయి. అణచివేతకు గురవుతున్న కులాలవారు దొరా అని పిలువకపోతే అగ్రకులాల్లో ఉన్న రాక్షస ప్రవృత్తి అనేక పీడన రూపాల్లో బయటకు వచ్చేది. తమను దొరా అని పిలువని స్త్రీల మీద తమ భర్తలను ఉసిగొల్పి, దగ్గరుండి ఆఘాయిత్యం చేయించేవారు.ఇలాంటి దారుణ పరిస్థితులపై ఐలమ్మ ఎర్రజెండా పట్టి ఎదురు తిరిగింది. మల్లంపల్లి భూస్వామి కొండలరావుకు పాలకుర్తిలో నలభై ఎకరాల భూమి ఉండగా ఐలమ్మ కౌలుకు తీసుకుని అందులో నాలుగెకరాలు సాగుచేసింది. పాలకుర్తి పట్వారీ వీరమనేని శేషగిరిరావుకు ఐలమ్మ కుటుంబానికి విరోధం ఏర్పడింది. ఆ కాలంలోనే జీడి సోమనర్సయ్య నాయకత్వంలో ఆంధ్రమహాసభ ఏర్పడింది.

ఐలమ్మ ఆ సంఘంలో సభ్యురాలు. పాలకుర్తి పట్వారీ శేషగిరిరావు ఐలమ్మను కుటుంబంతో వచ్చి తన పొలంలో పనిచేయాలని ఒత్తిడి చేయడంతో పనిచేయడానికి నిరాకరించింది. పాలకుర్తి పట్వారీ పప్పులుడకపోవడంతో అయిలమ్మ కుటుంబం కమ్యూనిస్టుల్లో చేరిందని విసునూర్‌ దేశ్‌ముఖ్‌ రాపాక రాంచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశాడు. దీంతో వారిపై మోపిన కేసులో అగ్ర నాయకులతో పాటు ఐలమ్మ కుటుంబాన్ని కూడా ఇరికించారు. అయినప్పటికీ న్యాయస్థానంలో తీర్పు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా వచ్చింది. అయిలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తే సంఘం పట్టు కోల్పోతుందని భావించిన దేశ్‌ముఖ్‌ పట్వారిని పిలిపించుకొని, ఐలమ్మ కౌలుకు తీసుకున్న భూమిని తన పేరున రాయించుకున్నాడు. భూమి తనదని, పండించిన ధాన్యం తనదేనని పంటను కోసుకురమ్మని వందమందిని దేశ్‌ముఖ్‌ పంపాడు. దీంతో గుండాలకు ఎదురు తిరిగిన ఆంధ్రమహాసభ కార్యకర్తలు వరిని కోసి, వరికట్టలు కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. భీంరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, చకిలం యాదగిరి లాంటి కమ్యూనిస్టు నాయకులు ధాన్యపు బస్తాలను భుజాలపై మోసారు.

తీవ్ర ఆగ్రహం చెందిన దేశ్‌ముఖ్‌ తన మనుషులను పంపి ఐలమ్మ ఇంటిని కూడా తగులబెట్టించాడు. వారు ధనాన్ని, ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు. ఐలమ్మ కూతురు సోమ నర్సమ్మపై లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో ఐలమ్మ కుమారులు ముగ్గురు పాలకుర్తి పట్వారీ ఇంటిని కూల్చి అదే స్ధలంలో మొక్కజొన్న పంటను పండించారు. అనేక రకాలుగా నష్టపోయినప్పటికీ అయిలమ్మ కుటుంబం ఎరజ్రెండాను వీడలేదు.’ఈ దొరగాడు ఇంతకంటే నన్ను ఏవిధంగా నష్టపెట్టగలడు’ అని తనలో తాను ప్రశ్నించుకుంది. ‘దొరోడు ఏం చేస్తాడ్రా’ అని మొక్కవోని ధైర్యంతో రోకలిబండ చేతబూని గూండాలను తరిమి కొట్టింది. కాలినడకన వెళ్లి దొరకు సవాలు విసిరింది. అయిలమ్మ భూపోరాటం విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యాన్ని, అలాగే తొంభై ఎకరాల దొర భూమిని కూడా ప్రజలకు పంచారు. ఆ తర్వాత సాయుధ పోరాటం విజయవంతమై పది లక్షల ఎకరాల భూపంపకం కూడా జరిగింది.ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ సెప్టెంబర్‌ 10, 1985న అనారోగ్యంతో మరణించింది. పాలకుర్తిలో ఐలమ్మ స్మారక స్థూపం, స్మారక భవనాన్ని సీపీఐ(ఎం) నిర్మించింది. ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలి. ఆమె జీవితాన్ని, చరిత్రను ప్రతిఒక్కరూ అధ్యయనం చేయాలి.

(నేడు ఐలమ్మ 130వ జయంతి)

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed