తుఫాన్ లు —నా అనుభవాలు (ఒక పెద్దాయన వివరించిన కథ)
Oplus_131072
అక్టోబర్ 31 హైదరాబాద్: మా తీర ప్రాంత వాసులకు తుఫాన్ లు కొత్తేం కాదు. అవును .అవి మా రోజు వారీ జీవితం లో ఒక భాగమే !ప్రతీ సంవత్సరం ఒక్కసారైనా ఈ తుఫాన్ మమ్మల్ని పలకరించి వెడుతూనే ఉంటుంది.
ఇవాళ సోషల్ మీడియా లో వచ్చిన వార్త (అంతేర్వేది లక్ష్మీ నరసింహ స్వామి మహాత్మ్యం గురించి )చూశాక ఇది వ్రాయాలి అనిపించింది.
నాకు పది ఏళ్ళ వయసు లో మొదటి సారిగా గాలివాన పేరు విన్నాను. అది 1969 నవంబర్ 7 వ తారీఖు. తెల్లవారితే నరక చతుర్థి .ఆరోజు రాత్రి మొదటిసారిగా భయంకరమైన రాత్రిని చూశాను. నాకు చిన్నప్పటి నుండి వర్షమొస్తే ఎంతో సరదా. ‘వానా వానా వల్లప్పా ’ అనుకుంటూ గిర గిరా తిరిగే వాళ్ళం. కాని ఆరోజు మమ్మల్ని మా పెద్దలు వర్షం లోకి వెళ్ళనివ్వ లేదు. కొబ్బరికాయ లు .ఆకులు మీద పడతాయని ఇంట్లోకి లాక్కుపోయారు. చీకటి పడేవేళకు కరెంట్ పోయింది. మళ్ళీ పదిహేను రోజులకు వచ్చింది .రాత్రంతా ఒకటే హోరు గాలి. చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లు అ గాలికి వంగిపోతున్నాయి. చెట్లపైన కాయలు గెలలు శబ్దం చేసుకుంటూ రాలిపోతున్నాయి. గాలి శబ్దానికి భయం వేస్తోంది .ఆరాత్రి మొదటిసారిగా గాలి వర్షం నన్ను భయపెట్టాయి. మర్నాడు పొద్దుటికి వర్షమూ లేదు గాలీ లేదు. దొడ్లోని కొబ్బరి చెట్లు నేల మీద పడున్నాయి .పొలంలోని జీతగాడు వచ్చి కొబ్బరి చెట్లయితే పడలేదు కాని కాయలన్నీ నేలమీదే ఉన్నాయి అన్నారు.
‘ప్రాణ హాని ఏమీ లేదు కదా ’ మా మామ్మ (నాయనమ్మ )ప్రశ్న
‘లేదమ్మ గారు ‘వెంకడి జవాబు
’పోనీలే వెధవ కాయలు పోతే పోయాయి. మీరంతా బాగున్నారు అదే చాలు ‘అని ఆమ్మ కేసి తిరిగి ’ఓసేవ్ బాచి అ చిన్న ఆవకాయ జాడీ వెంకడికీయ్యి. రాత్రికి తింటారు. ఎప్పుడనగా తిన్నారో ఏమో ‘ అని పురామాయింపు !!!
ఆరాత్రి పక్కన పడుకో పెట్టుకుని ’ ఎంత పెద్ద గాలివానా వచ్చిన మనకు భయం లేదురా ‘అంది.
’ఎందుకు మామ్మ ‘నా ప్రశ్న
’అంతేర్వేది లక్ష్మి నరసింహ స్వామి ఒక బెత్తం చేత్తో పట్టుకొని సముద్రం ఒద్దునే కూర్చుంటాడు. సముద్రం అలలు ఎత్తుకు లేస్తుంటే అ బెత్తంతో అలల నెత్తి మీద నాలుగు దెబ్బలు వేస్తాడు. అంతే ..అలలు నోరేత్తకుండా వెనక్కి వెళ్ళిపోతాయి. అ స్వామి ఉన్నంతవరకు మనకు భయం లేదురా ‘ అని చెబుతూ జోకొట్టి పడుకోబెట్టింది .
అ తరువాత నేను ఇంటర్ మీడియేట్ చదువుకునే రోజుల్లో 1977 నవంబర్ 19 వ తేదీన అత్యంత భయంకరమైన తుఫాన్, ఉప్పెన వచ్చాయి .
బహుశాహః 25-11-1839 లో వచ్చిన ‘కోరంగి తుఫాన్ ,ఉప్పెన (3 లక్షల మంది ప్రజలు చనిపోయారు )తరువాత అతి ఎక్కువగా జన నష్టం జరిగిన తుఫాన్ ఇదేనేమో! ఇది ’దివి సీమ ఉప్పెన ‘గా పేరుకేక్కింది. ఉప్పెన వచ్చిన వారానికి మా వై ఎన్ కళాశాల విద్యార్థులు సేకరించిన లక్ష రూపాయలు విలువైన వస్తువులు పంచడానికి వెళ్ళినప్పుడు నేను చూసిన సన్నివేశం. ..సరిగా రైతులు వరి చేలు కోతలు కోసి పనలపై పెట్టిన రోజుల్లో వచ్చిందీ ఉప్పెన. పంట పొలాల్లో ఉండవలసిన వరి పనలు తాడి చెట్ల మొవ్వులలో ఉన్నాయి. అంటే ఉప్పెన కెరటాలు ఎంత ఎత్తున వచ్చాయో అర్ధం చేసుకోవచ్చు. అప్పుడు అంతర్వేది మచిలీపట్నం ల మధ్య తుఫాన్ తీరం దాటింది .కాని అంతర్వేది చుట్టుప్రక్కల పంట నష్టమే కానీ ప్రాణ నష్టం ఏమీ లేదు .
కారణం అంతర్వేది లక్ష్మి నరసింహుని మహిమే. ..!!
మళ్ళీ 1996 నవంబర్ 9 వ తేదీన కోనసీమ ను సర్వ నాశనం చేసిందో తుఫాన్. అ తుఫాన్ గాలి ఎంత ఉధృతంగా ఉందంటే ‘మొండెపు లంక ’ నుండి కొబ్బరి చెట్లకు అక్కడక్కడా మొండాలు మిగిలాయి కాని కొబ్బరి మొవ్వులు మాత్రం ఎక్కడా లేవు. ‘కొడుకులు లేకపోయినా పర్వాలేదు దొడ్లో రెండు కొబ్బరి చెట్లుంటే చాలు జీవితం గడిచిపోతుంది ’ అని నమ్మే కోనసీమ వాసులెందరో అ కొబ్బరి చెట్ల క్రిందనే పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు.
విచిత్రం ఏమంటే సఖినేటిపల్లి నుండి రాజోలు తాలూకా లో ఒక్క మరణం కూడా సంభవించలేదు.
ఇది అంతర్వేది స్వామి మహిమ కాకుంటే మరేమిటి ?
అ స్వామి కల్యాణానికి వ్యాఖ్యనం చెప్పే భాగ్యాన్ని నాకు అనుగ్రహించాడు అ దేవదేవుడు .
అప్పుడు సందర్భాన్ని ఈ విషయాలు ప్రస్థావించాను. మళ్ళీ అయన అనుగ్రహిస్తే ఈసారి కూడా ……
అ అంతర్వేది లక్మి నరసింహుని దయ అపారంగా ఎల్లప్పుడూ మనపై ధారాళంగా కురవాలని ప్రార్ధిస్తూ. …….🙏🙏🙏🙏🙏
—–చక్రావధానుల రెడ్డప్ప దవేజీ
. 9703115588