గ్రామీణ ప్రాంతాలలో గడచిన 12 ఏండ్లల్లో ఒక్క ఇల్లు కూడా మంజురు చేయలేదు,కనీసం ఈ ఏడాదిలోనైనా 3 లక్షల ఇండ్లు మంజూరు చేయండి.కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు మంత్రి శ్రీ పొంగులేటి విజ్ఞప్తి
ఫిబ్రవరి 21 హైదరాబాద్:తెలంగాణ ప్రాంత ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా 2014-23 వరకు దాదాపు పది సంవత్సరాలలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పేదల ఇండ్ల నిర్మాణం జరగలేదు. దీంతో ఇండ్ల నిర్మాణానికి ప్రజల నుంచి భారీ ఎత్తున డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన ఇండ్లను మంజూరు చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
పేదల సంక్షేమాన్ని విస్మరించిన ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలల్లో కేంద్రం నుండి ఒక ఇల్లు కూడా తీసుకోలేదు. కానీ గౌరవ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు గ్రామీణ ప్రాంతాలకు ఇండ్లు మంజురు చేయాలని గడిచిన రెండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వానికి పదేపదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. కానీ కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం లేదు. కనీసం ఈ ఆర్థిక సంవత్సరంలోనైనా గ్రామీణ ప్రాంతాలకు 3 లక్షల ఇండ్లు మంజురు చేయాలని కేంద్రాన్ని కోరారు.
కేంద్ర వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా శనివారం హైదరాబాద్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గృహ నిర్మాణానికి సంబంధించి పలు అంశాలను ప్రస్తావించారు. ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు.
“గత ప్రభుత్వం రాష్ట్రంలో గృహ నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. పది సంవత్సరాలలో సంవత్సరానికి కనీసం పదివేల ఇండ్లను కూడా నిర్మించలేదు. పైగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఇల్లు కూడా తీసుకోలేదు. ఈ పరిస్ధితుల నేపథ్యంలో రెండేళ్ల క్రితం రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన మా ప్రభుత్వం పేదల ఇండ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. వచ్చే మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఈ ఏడాది దాదాపు నాలుగు లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజురు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తే ఈ కార్యక్రమం మరింత వేగవంతం అవుతుంది.
తెలంగాణ రాష్ట్రం గతంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G) 1.0లో భాగస్వామ్యం కాలేదు. అయితే 2023 తరువాత మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (MoRD) మార్గదర్శకాల ప్రకారం PMAY-G 2.0 లో రాష్ట్రం అధికారికంగా చేరింది.
2024 ఆగస్టులో కేంద్ర మంత్రివర్గం PMAY-G 2.0కు ఆమోదం తెలిపి, ఆవాస్+2018 సర్వే నవీకరణ తర్వాత సాచురేషన్ పద్ధతిలో గృహాల మంజూరు చేయాలని నిర్ణయించినప్పటికీ, పాత డేటా ఆధారంగా 2024-25 మరియు 2025-26 సంవత్సరాలకు ఇతర రాష్ట్రాలకు 1.19 కోట్ల గృహాలను కేటాయించింది. తెలంగాణ రాష్ట్రం PMGY 1.0 లో భాగస్వామ్యం కాకపోవడంతో 2018 పెండింగ్ డాటా లేదు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ విస్తృత సర్వే నిర్వహించి అర్హులైన లబ్ధిదారుల డేటాబేస్‌ను సిద్ధం చేసుకుంది. అయినప్పటికీ, కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఆవాస్+2024 మొబైల్ యాప్ ద్వారా మరోసారి సర్వే నిర్వహించి మొత్తం 11.57 లక్షల అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో గత 12 ఏళ్లలో ఏర్పడిన పెండింగ్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని పరిస్థితులను అర్థం చేసుకొని ఈ ఆర్థిక సంవత్సరములో 3 లక్షలు, వచ్చే ఏడాది మరో రెండు లక్షల ఇండ్లను మజూరు చేయాలని” మంత్రి పొంగులేటి గారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి విజ్ఞప్తి చేశారు.
పేద కుటుంబాలకు సురక్షితమైన, గౌరవప్రదమైన నివాసాన్ని కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, పేదలకు సొంతింటి కల నెరవేర్చడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సంకల్పమని, ఈ లక్ష్య సాధనలో కేంద్రం సానుకూలంగా స్పందింస్తుందని మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆశాభావం వ్యక్తం చేశారు.