క్రీడాకారుల ప్రోత్సాహానికి ప్రజాప్రభుత్వం గొప్ప క్రీడా పాలసీని రూపొందించింది-మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
జనవరి 18 హైదరాబాద్: క్రీడా స్ఫూర్తిని, క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించాలనే లక్ష్యంతో నిర్వహించిన కాకా వెంకటస్వామి మెమోరియల్ T20 క్రికెట్ టోర్నమెంట్ ద్వారా యువ క్రికెటర్లకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పించిన నిర్వాహకులకు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అభినందనలు తెలిపారు.కాకా సేవలను స్మరించుకుంటూ, తండ్రి ఆశయాల కనుగుణంగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా కాకా కుమారులు చేస్తున్న ఇంత గొప్ప కార్యక్రమం ఎంతో అభినందనీయమని మంత్రిగారు కొనియాడారు.విశాఖ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ T20 లీగ్ లో విజేతలుగా నిలిచిన జట్లకు శనివారం హైదరాబాదులోని జింఖానా మైదానంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి గారు, పొన్నం ప్రభాకర్ గారు,ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారితో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బహుమతులు అందించారు.
రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 22వ తేదీ నుంచి 29 జట్లతో దాదాపు అన్ని జిల్లాలను కవర్ చేస్తూ క్రికెట్ నందు మట్టిలో మాణిక్యాల్లాంటి వారిని వెలికి తీసేందుకు కాకా స్వామి మెమోరియల్ టి20 క్రికెట్ పోటీల నిర్వహణ ఎంతో గొప్పగా జరిగిందన్నారు.
క్రికెట్ అంటే అర్బన్ కాదు రూరల్ ల్లో కూడా ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉన్నారని గుర్తించి వారిని ప్రోత్సహించడం కోసం ఈ పోటీలు నిర్వహించడం చాలా సంతోషమన్నారు. క్రీడల ప్రోత్సాహానికి గౌరవ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని మంత్రిగారు తెలిపారు.. రాష్ట్ర చరిత్రలోనే గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక గొప్ప క్రీడా పాలసీని రూపొందించుకోవడం జరిగిందన్నారు.
అన్ని రకాల క్రీడలకు సరైన ప్రోత్సాహం అందించి దేశంలోని రాష్ట్రాలతోనే కాదు ప్రపంచంలోని దేశాలతో కూడా పోటీపడేలా క్రీడాకారులను తయారు చేయడంలో గొప్ప సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని మంత్రిగారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోటీలో విజేతలుగా నిలిచిన విన్నర్స్ రన్నర్స్ కి మంత్రిగారు శుభాకాంక్షలు తెలిపారు.