ఉత్తమ చిత్రాల నిర్మాత –ఉత్తమాభిరుచి గల నిర్మాత – తెలుగు సినిమా కీర్తిని జాతీయస్థాయికి తీసికెల్లగలిగిన నిర్మాత, తెలుగు సినిమాకు పూర్ణోదయ వెలుగులు పంచిన ఏడిద నాగేశ్వరరావు గారి వర్ధంతి జ్ఞాపకం
Oplus_131072
అక్టోబర్ 5 హైదరాబాద్:శంకరాభరణం, సీతాకోకచిలక, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి చిత్రాలంటే పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ గుర్తుకువస్తుంది. కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ
చలనచిత్ర నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు .
…..
బాల్యం నుంచీ నటన అంటే చెప్పలేనంత ఇష్టం. చిన్నతనంలో స్త్రీ పాత్రలువేసి మెప్పించారు. కాకినాడ పి.ఆర్.కాలేజ్ లో శ్రీ వి.బి.రాజేంద్రప్రసాద్ (ప్రసిద్ద నిర్మాత, నేటిమేటినటుడు జగపతిబాబు తండ్రి). శ్రీ హరనాథ్ రాజ్ (60 వ దశకంలో ప్రసిద్దనటుడు) – శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి సహాద్యాయులు. వారు ముగ్గురూ, ఆ రోజుల్లో, కాకినాడలో కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ ఉండేవారు.
…..
శ్రీ నాగేశ్వరరావు నటన మీద మక్కువతో – నాటకాల్లో నటుడిగా, సినీనటుడిగా,డబ్బింగ్ కళాకారునిగా తన సినీ ప్రస్థానం ప్రారంభించారు. సినీచిత్ర నిర్మాణరంగంపై దృష్టి సారించి 1978 లో “పూర్ణోదయమూవీ క్రియేషన్స్” ప్రారంభించారు. ప్రారంభచిత్రం –‘సిరిసిరిమువ్వ ‘ హిరోయిన్ మూగది హీరో డప్పు కొట్టుకునేవాడు. పెద్ద తారాగణమేమీ లేదు. అందరూ పెదవి విరిచారు. ఫైట్లు లేవు…భారీ సెట్టింగులు లేవు… ప్రముఖ తారాగణం అంతకన్నా లేరు… కొనడానికి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ ముందుకు రాలేదు.కానీ నిర్మాత – శ్రీ ఏడిద నాగేశ్వరరావుగారు వీళ్లనెవరినీ నమ్ముకోలేదు కేవలం… కథను నమ్ముకున్నారు, సంగీతాన్ని నమ్ముకున్నారు, విశ్వనాథ్ ప్రతిభను నమ్ముకున్నారు. ఫలితం… మొదటిసినిమాయే బంపర్ విజయం సాధించింది. మూగపిల్లగా జయప్రద అభినయం, చంద్రమోహన్ అభినయ కౌశలం.. చిత్రాన్ని విజయపథంలో నడిపించాయి. శ్రావ్యమైన సంగీతం, సిరిసిరిమువ్వ పాటలు జనరంజకాలయ్యాయి. అంతేకాదు ‘మాస్కో ఫిలిం ఫెస్టివల్’ లో ప్రదర్శనకు ఎంపికయింది.
…..
1970 దశకంలో హేమాహేమీలయిన నటులు NTR, కృష్ణ, ANR తదితరులు ‘మాస్ పంథా’ వైపు మళ్ళినపుడు కళాత్మక విలువలతో 1976 లో ఆయన మిత్రుల ప్రోత్సాహంతో సిరి సిరి మువ్వ చిత్రానికి నిర్వహణ బాధ్యతులు వహించి మంచి విజయం సాధించారు . ‘సిరిసిరిమువ్వ‘చిత్రం నిర్మించడం సాహసమనే చెప్పాలి. శ్రీ ఏడిద నాగేశ్వరరావుగారు ‘పూర్ణోదయామూవీక్రియేషన్స్’ పతాకంపై కేవలం పది సినిమాలే నిర్మించారు. 1978 నుంచి 1992 వరకు వారు చిత్రనిర్మాణంలో ఉన్నారు. వారు నిర్మించిన పది సినిమాలూ కూడా సాహిత్య, సంగీత ప్రధానమైనవే…కళాత్మకమైనవే…చిత్రాల జాబితా చూసుకుంటే…
1) సిరిసిరిమువ్వ(1978)
2) తాయారమ్మ-బంగారయ్య(1979)
3) శంకరాభరణం(1979)
4) సీతాకోకచిలుక(1981)
5) సాగరసంగమం(1983)
6) సితార(1984)
7) స్వాతిముత్యం(1986)
8) స్వయంకృషి(1987)
9) స్వరకల్పన(1989)
10) ఆపద్భాందవుడు (1992)
పైన తెలిపిన పది సినిమాల్లో కళాతపస్వి
శ్రీ విశ్వనాథ్ ఆరుచిత్రాలకు దర్శకత్వం వహించారు. విలక్షణ దర్శకుడు ‘వంశీ’ రెండు చిత్రాలకు, ప్రసిద్ధ తమిళ దర్శకుడు శ్రీ భారతీరాజా ఒక చిత్రానికి, శ్రీ కొమ్మినేని శేషగిరిరావు ఒక చిత్రానికి దర్శకత్వం వహించారు.
……
పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ సంస్థను స్థాపించి మొదటి చిత్రంగా తాయారమ్మ బంగారయ్య చిత్రాన్ని నిర్మించారు . అది మంచి విజయం సాధించింది .తదుపరి చిత్రం కళా తపస్వి కే. విశ్వనాధ్ గారి దర్శకత్వంలో శంకరాభరణం . తెలుగు చిత్ర ఖ్యాతని ఖండాంతరాలకు తీసుకు వెళ్లిన అద్భుత కావ్యం . ఈ చిత్రానికి వచ్చినంత పేరు ప్రఖ్యాతలు , box office కలెక్షన్స్ గాని , జాతీయ – అంతర్జాతీయ – రాష్త్ర అవార్డులు ఏ చిత్రానికీ రాలేదంటే , అతిశయోక్తి కాదు. జాతీయ స్థాయిలో స్వర్ణ కమలం పొందిన మొట్ట మొదటి చిత్రం .
…….
అలాగే ఏ దేసేమెళ్లినా శంకరాభరణం గురించి ప్రస్తావనే అప్పట్లో .ఆ తర్వాత వచ్చిన సీతాకోకచిలుక అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ . ఇప్పుడు వస్తున్న అనేక విజయవంతమైన ప్రేమ కధా చిత్రాలకు సీతాకోకచిలుక చిత్రమే ఇన్స్పిరేషన్ . ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది . ఏడిద నిర్మించిన తదుపరి చిత్రం, కమలహాసన్ కే.విశ్వనాధ్ కాంబినేషన్ లో సాగర సంగమం. ఈ చిత్రానికి కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు . అవార్డులు తో పాటు రివార్డులు సొంతం చేస్కుకున్నదీ చిత్రం . తెలుగు, తమిళం & మలయాళం లో ఒకే సారి విడుదలయ్యి సూపర్ హిట్ అయ్యింది . తదుపరి చిత్రం మరో క్లాసిక్ – సితార . ఏడిద వద్ద అప్పటి వరకూ అన్ని చిత్రాలకూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వంశీ దర్శకత్వం లో సుమన్, భానుప్రియ జంటగా వచ్చిన ever green classic . సితార కి కూడా జాతీయ అవార్డుల్లో పెద్ద చోటే దక్కింది .ఇక స్వాతిముత్యం – కే.విశ్వనాధ్ కమలహాసన్ రాధిక ల కలయిక లో వచ్చిన ఆణిముత్యం. 1986 లో విడులయ్యిన ఈ చిత్రం , అప్పటికి బాక్స్ ఆఫీస్ records ని బీట్ చేసింది . జాతీయ అవార్డు , రాష్ట్ర బంగారు నంది పొందిన ఈ ముత్యం ప్రతిషాత్మక ఆస్కార్ అవార్డులకు భారత దేశం తరపున ఎన్నుకోబడిన మొట్ట మొదటి తెలుగు చిత్రం .
……
ఇక స్వయంకృషి – మెగాస్టార్ చిరంజీవి తో ఏ కమర్షియల్ చిత్రమో తియ్యకుండా , ఓ సాధారణ చెప్పులు కొట్టుకునే సాంబయ్య పాత్రతో సినిమా తియ్యడం పెద్ద సాహసమే . అది విజయవంతం చేసి అందరి మన్ననలూ పొందారు ఏడిద . మంచి విజయం సాధించిన ఈ చిత్రం , చిరంజీవి కి మొట్ట మొదటి సారి ఉత్తమ నటుడిగా రాష్ట్ర నంది అవార్డు దక్కించింది .
…..
ఆయన రెండో కుమారుడు శ్రీరాం హీరో గా చేసిన స్వరకల్పన ఆశించనంతగా ఆడలేదు.1992లో
శ్రీ నాగేశ్వరరావు గారు నిర్మించిన చివరి సినిమా ‘ఆపద్బాంధవుడు‘ లో కూడా చిరంజీవే కథానాయకుడు,మీనాక్షిశేషాద్రి హీరోయిన్. దీనికి కూడా శ్రీ విశ్వనాథ్ చిరంజీవి నట విశ్వరూపానికి ఓ మంచి ఉదాహరణ . రెండవ సారి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటుడిగా నంది అవార్డు .అలాగే జాతీయ ఉత్తమ నటుడిగా కొంచంలో మిస్ అయ్యింది .
…..
ఉత్తమ చిత్రాల నిర్మాత –ఉత్తమాభిరుచి గల నిర్మాత – తెలుగు సినిమా కీర్తిని జాతీయస్థాయికి తీసికెల్లగలిగిన నిర్మాత – శ్రీ ఏడిద నాగేశ్వరరావుగారు. వీరు తెలుగు సినీ నిర్మాతల కౌన్సిల్ – కార్యదర్శిగా, రాష్ట్ర నంది అవార్డుల కమిటీ అధ్యక్షునిగా, జాతీయ చలనచిత్ర, అవార్డుల కమిటీ సభ్యునిగా తన సేవలనందించారు. మూడు జాతీయ అవార్డులను, అనేక నంది అవార్డులను గెలుచుకున్న చిత్రాలను నిర్మించిన శ్రీ ఏడిద నాగేశ్వరరావుగారు చిరస్మరణీయుడు. వారి ఇంటికి పెట్టుకున్న పేరు – ‘శంకరాభరణం’. వీరు చలనచిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గుర్తింపుగా ‘దాదాసాహెబ్ఫాల్కే అవార్డు’కు నామినేట్ చేయబడ్డారు. తెలుగు చలనచిత్ర కీర్తిబావుటా రెపరెపలాడించిన శ్రీ ఏడిద నాగేశ్వరరావుగారు, కళనే ఊపిరిగా నమ్ముకుని, అన్నీ కళాత్మక చిత్రాలనే నిర్మించిన శ్రీ ఏడిద నాగేశ్వరరావుగారి అన్ని చిత్రాలకూ రాష్ట్ర ప్రభుత్వ నందులు గానీ, జాతీయస్థాయి అవార్డులు గాని పొందాయి. శ్రీ ఏడిద నాగేశ్వరరావుగారు తన 81 ఏళ్లవయస్సులో 04.10.2015 వ తేదీన స్వర్గాస్తులైనప్పటికీ, తెలుగు చలనచిత్రరంగంలో ఆయనో ధృవతార.