December 24, 2025

ఆగస్ట్ 15- 1947- ఏం జరిగిందో భారతీయులకందరికీ తెలుసు.భరత మాత తెల్ల వాడి దాస్యం నుండి విముక్తురాలై…నల్లవాడి చేతుల్లో కొచ్చిన రోజు

0
IMG-20250926-WA2888

ఆగస్ట్ 15- 1947- ఏం జరిగిందో భారతీయులకందరికీ తెలుసు.
భరత మాత తెల్ల వాడి దాస్యం నుండి విముక్తురాలై…నల్లవాడి చేతుల్లో కొచ్చిన రోజు.ఆ రాత్రంతా…భరతావనిలో పండుగే…ఎవ్వరూ నిద్ర పోకుండా..ఇళ్ళన్నీ దీపాలతో…వీధులన్నీ విద్యుత్ దీపాల వెలుగులతో నింపేశారు.అప్పుడు జిద్ది అనే సినిమా షూటింగ్ లో ఉన్న యువకుడు కూడా…స్నేహితులతో బొంబాయి లోని రిట్జ్ హోటల్ లో వేకువ ఝాము వరకు సెలెబ్రేట్ చేసుకుని…
దీపాలతో వెలిగిపోతున్న లోకల్ ట్రైన్ ఎక్కి నివాసాన్ని చేరుకుని పగటిపూట మస్తుగా నిద్రలోకెళ్ళాడు!అతనే మన భారతీయ మొట్ట మొదటి ఫాషన్ ఐకాన్, స్టైలిష్ స్టార్ – దేవ్ ఆనంద్.

                       -oo0oo-

1940లో బొంబాయిలో ఒక అకౌంటెంట్ ఆఫీస్ లో క్లర్క్ గా చేరాడు ఇంగ్లీష్ లిటరేచర్ లో బి.ఏ చేసి. తృప్తి లేదు.

1946 లో హం ఏక్ హై- అనే మూవీ తో ప్రభాత్ మూవీస్ తో అరంగేట్రం చేసినా….1948లో రిలీజ్ అయిన జిద్ది తో గాని గుర్తింపు రాలేదు.

మనం 1950 ల నుండి 1970ల దాకా అనుకరించిన హెయిర్ స్టైల్…

అదే నండి..ముందు ఒక పఫ్ పెట్టుకుంటాం కదా ఓ పక్క. దానికి ఆధ్యుడు ఈ మహానుభావుడే!

టైలర్డ్ సూట్లు, స్టైలిష్ నడక, హెడ్ నాడ్ మేనరిజం…బాలీవుడ్ గ్రెగరీ పెక్ అని పేరెళ్ళిపోయాడు.

రాజ్ – దిలీప్ – దేవ్…..త్రయం…ఉజ్వలంగా ఓ వెలుగు వెలిగిన కాలం అది.

ఎవరి స్టైల్ ఆఫ్ యాక్టింగ్ వారిది! ముగ్గురికీ ఫాలోయింగ్ సమానంగా ఉండేది.

                      -oo0oo-

అప్పటికే సురయ్యా బాగా పేరొందిన తార, గాయని. విద్య (1948) అనే మూవీ షూటింగ్ లో దేవ్ & సురయ్యా ల పరిచయం…ప్రణయానికి దారి తీసింది.

అలా మొదలైనది…

1950 లో దేవ్ తన నవకేతన్ బానర్ లోనే నిర్మిస్తున్న అఫ్సార్ షుటింగ్ టైం లో ప్రపోజ్ చేశాడు.

కానీ సురయ్యా అమ్మమ్మకు వీళ్ళ వ్యవహారం సుతరాము గిట్టేది కాదు.

బంగారు బాతు సురయ్యా..మరి వదులుకోవటం కష్టం కదా! ఖచ్చితంగా వీలుకాదంది.

1954 లో టాక్సీడ్రైవర్ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న కల్పనా కార్తీక్ ను లంచ్ బ్రేక్ లో సింపుల్ గా పెళ్ళి చేసుకుని…

మళ్ళీ షూటింగ్ లో కూడా పాల్గొన్నారట ఆ రోజే దంపతులిద్దరు!

సురయ్యా అందం, నటన, గానం ….అన్నీ కలబోసిన వజ్రం.

అంతే కాదు…1963 లో …తనకు ఇంకా ప్రజాదరణ ఉన్నా…స్వయం నిర్ణయం తో తెరమరుగై…

2004 లో మరణం వరకు మళ్ళీ పెళ్ళి ఊసెత్తలేదు. మరి ఏవరి ప్రేమ గొప్పదో మీరే చెప్పాలి!?

                      -oo0oo-

నటుడుగా, నిర్మాతగా 101 సినిమాలలో నటించాడు దేవ్ ఆనంద్.

గైడ్- మూవీ ఒక మైలు రాయి.

పద్మభూషణ్ , దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు…
ఇంకా లెక్క లేనన్ని అవార్డులు!

సినిమా అంటే విపరీతమైన మోజున్న నటుడు. దిలీప్ కుమార్, రాజ్ కపూర్ & దేవ్ ఆనంద్ – త్రయం లో ఎక్కువ కాలం హీరో గా నిలిచినది దేవ్ మాత్రమే!

రొమాంటిక్….ఎవర్ గ్రీన్ హీరో అన్న బిరుదు హిందీ చిత్రసీమలో నిస్సందేహంగా దేవ్ ఆనంద్ దే.

క్రొత్త టాలెంట్ వెదికి పట్టడం లో ఆరితేరినవాడు. జీనత్ అమన్ & టీనా మునీం…దేవ్ డిస్కవరీలే.

                       -oo0oo-

పుట్టుకతోనే….చావూ పుట్టేస్తుంది!

ఒక్కొక్కరు…ఒక్కో విధంగా జీవితాన్ని లాగించేస్తారు. ఏమైనా మనకు అలాట్ చేసిన నూరేళ్ళలో…

ఎంత కాలం హాయిగా…నిర్విచారంగా జీవించామనేది ముఖ్యం.

ఈ విషయంలో దేవ్ ఆనంద్ వెరీ లక్కీ. 80 దాటినా…సినిమాలు తీస్తూనే ఉండేవారు!
ఎప్పుడూ యాక్టివ్ గానే ఉండేవారు!

జీవితం చాలా చిన్నది. అందుకే…ఉన్న సమయంలోనే…ఎక్కువగా చేసేయాలనే ఆరాటం! అందుకే చక చకా…గబ గబా మాట్లాడేస్తుంటాను.

ఎక్కడ…ఎప్పుడు నా సమయం ఐపోతుందేమో అని!…అనేవారు దేవ్ జీ.

88 ఏళ్ళ వయసులో కూడా…నా మనసు మాత్రం 20 ఏళ్ళప్పుడెలా ఉందో…ఇప్పుడూ అంతే అనేవారు.

1946-2011 వరకు సినిమాలలోనే జీవించాడు.
జయాపజయాలతో సంబంధం లేకుండా.

చివరి మూవీ రిలీజ్ అయిన కొన్ని నెలలకు…లండన్ లో హోటల్ లో గుండెపోటుతో డిసెంబర్ 3- 2011 లో కాలం చేసాడు…
ఇండియన్ ఫస్ట్ ఫాషన్ ఐకాన్, బాలీవుడ్ గ్రెగరీ పెక్ గా పేరొందిన – దేవ్ ఆనంద్..తనకోసం భారత సినీ చరిత్రలో ప్రత్యేక పేజీ కేటాయించుకుని.
.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed