December 24, 2025

పింఛన్ల పంపిణీలో ఆలస్యానికి చెక్. మంత్రి సీతక్క కీలక ప్రకటన.

0
IMG-20250830-WA1527

ఆగస్టు 30 హైదరాబాద్: ప్రజల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం చేయూత సామాజిక భద్రతా పింఛన్ల పథకంను అమలు చేస్తోంది. ఈ పథకం లక్ష్యం ఆర్థికంగా బలహీన వర్గాలకు భరోసా ఇవ్వడం.

ఒంటరి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, హెచ్‌ఐవీ బాధితులు, డయాలసిస్ రోగులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు వంటి అనేక వర్గాలకు ఈ పింఛన్లు ఒక ఆశ్రయం లాంటివి. ప్రస్తుతం మొత్తం పదకొండు రకాల పింఛన్లు ఈ పథకం కింద అందజేస్తున్నారు.

అయితే పింఛన్ దారులు డబ్బులు అందజేసే క్రమంలో వారి ఫింగర్ ప్రింట్‌ తీసుకునేందుకు ఇప్పటి వరకు 2జీ అధారిత ఫింగర్ ప్రింట్లను వాడేవారు. దీంతో అటు సిగ్నల్ రాక.. ఇటు ఫింగర్ ప్రింట్ సరిగ్గా పడక.. కూలి పనులు చేసే వారు, శారీరకంగా బలహీనులు, రోగులు వంటి వారికి పింఛన్ పొందడంలో అనేక సమస్యలు ఎదురయ్యేవి. ఈ ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిష్కారాన్ని ప్రవేశపెట్టింది. ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు సాఫ్ట్‌వేర్ ద్వారా ఇప్పుడు ధృవీకరణ జరగనుంది. దీని వలన ‘సరైన వ్యక్తికి – సరైన పింఛన్ – సరైన సమయంలో’ అందేలా ఒక పారదర్శక విధానం అమల్లోకి వస్తోంది.

ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ.15.50 కోట్ల బడ్జెట్ కేటాయించి.. 5G ఆధారిత L1 ఫింగర్ ప్రింట్ పరికరాలు, స్మార్ట్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 6,300 బ్రాంచ్ పోస్టుమాస్టర్లకు పరికరాలు పంపిణీ చేయనున్నారు. ములుగు జిల్లా పస్రా కేంద్రంలో మంత్రి సీతక్క , కలెక్టర్ టీఎస్ దివాకర్ కలిసి ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పోస్టుమాస్టర్లకు పరికరాలు చేరనున్నాయి. ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి బాధ్యతను TG Online చేపట్టింది. నూతన టెక్నాలజీ వల్ల ధృవీకరణ ప్రక్రియ కేవలం మూడు సెకన్లలో పూర్తవుతుంది. ఇక లబ్ధిదారులు పొడవాటి క్యూల్లో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా.. తక్షణమే పింఛన్లు పొందగలుగుతారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఈ కొత్త విధానం పింఛన్ పంపిణీ వ్యవస్థను డిజిటల్ రూపాంతరం చేస్తుందని తెలిపారు. ఇది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా.. ప్రభుత్వ పథకాలపై నమ్మకం పెంపొందించనుందని అన్నారు. పింఛన్‌దారుల సమస్యలను అర్థం చేసుకొని ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో పింఛన్ పొందడం ఒక పెద్ద సవాలుగా ఉండేది. అయితే ఆధునిక సాంకేతికత వినియోగంతో పింఛన్ దారులు ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డిజిటల్ రూపాంతరంతో ప్రభుత్వం తీసుకున్న ఈ అడుగు.. భవిష్యత్తులో ఇతర సంక్షేమ పథకాలకూ మార్గదర్శకంగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed