ఎన్నికలలో గెలిచిన ప్రజాప్రతినిధులారా,ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బులు సంపాదిస్తారా.! సమస్యలను పరిష్కరించి ప్రజల హృదయాలలో స్థానం సంపాదిస్తారా…!నిర్ణయం మీ చేతిలో ఉంది… బాల్ మీ కోర్టులోనే ఉంది… నిర్ణయించుకునే అవకాశం మీదే:✍️ డాక్టర్ కృష్ణ బంటు, ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్
ఫిబ్రవరి 20 హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ఎన్నికల ముఖ్య ఉద్దేశము ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావాలంటే ఎన్నికలు నిర్వహించి, ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తే ఆ అభ్యర్థిని ప్రజాప్రతినిధిగా ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. ప్రతినిధిగా ఎన్నికైన వారు ప్రజాస్వామ్యంలో అధికారాన్ని చేపట్టి తమను ఎన్నుకున్న ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేయాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. అంటే ప్రజలే తమకు నచ్చిన వ్యక్తిని ఓటు ద్వారా గెలిపించి, ప్రజాప్రతినిధిగా అధికార పీఠంపై ఎక్కించి తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిందిగా కోరుతుంటారు. ఆ విధంగా వివిధ రకాల పన్నులను ప్రజలపై వేసి, తద్వారా వచ్చిన డబ్బుతో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అధికారం చేపట్టిన వారు చేస్తుంటారు. అంటే ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల ద్వారా ఎన్నికై, తిరిగి అదే ప్రజల కోసం ప్రజాప్రతినిధులు పని చేయాల్సి ఉంటుంది. నేటి ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులు అంటే అర్థం మారిపోయింది. “ఓడ దాటే దాకా ఓడ మల్లయ్య ఓడ దాటినాక బోడి మల్లయ్య” అన్న సామెత చందాన ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన పెద్దలు తిరిగి అదే ప్రజల నెత్తిన కూసుని తాము ఆడింది ఆట, తాము పాడింది పాట అంటూ ఐదు సంవత్సరాలు వారికి నచ్చిన విధంగా పాలన అందిస్తారు. అయితే నిజాయితీతో ప్రభుత్వాన్ని నడిపి ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కట్టుబడ్డ ప్రజాప్రతినిధులను ప్రజలు గుండెల్లో పెట్టుకొని మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తారు. లేదంటే ఈసారి ఎన్నికలు జరిగినప్పుడు వారికి తగిన బుద్ధి చెప్పి ఓటమి పాలు చేస్తారు. అంటే అధికార పీఠంపై కూర్చో పెట్టాలన్న అధికార పీఠం నుంచి గుంజి పడేయాలన్నా ఓటరే కీలకం. అలాంటి కీలకమైన ఓటరు నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులకు ఒక కీలుబొమ్మలాగా మారిపోయాడని వ్యాఖ్యానాలు సర్వదా వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన నాయకులు ప్రజా సంక్షేమం, అభివృద్ధి విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండి, ప్రజలను గాలికి వదిలేసి తమ సొంత సంపాదన కోసం అర్హులు సాస్తున్న ప్రజాప్రతినిధులే నేటి ప్రజాస్వామ్యంలో ఎక్కువగా కనబడటం విడ్డూరం , శోచనీయం. అంటే ప్రజాస్వామ్యం ఎన్నికల విధానంలో చట్టసభలోకి పోతున్న లోక్ సభ, రాజ్యసభ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ, శాసనమండలి సభ్యులు కానీ, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కోఆప్షన్ సభ్యులు ఇలా ఏ స్థాయి ప్రజాప్రతినిధి అయినా తమ తమ స్థాయిలో, తమకు కేటాయించిన ప్రాంతంలో, తాను గెలిచి వచ్చిన ఏరియాలో, తమ నియోజకవర్గంలో, తమ జిల్లాలో, తమ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి, మౌలిక వసతులను కల్పించాలి, తద్వారా సంక్షేమ పథకాలు అందించి తమ తమ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెల్లించాలి. ఇలాంటి ఒక గొప్ప మహత్తరమైన, కీలకమైన, ప్రాధాన్యత గల ప్రజా ప్రతినిధిగా ఉండి ఎవరు ఎంత మేర ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధి అనే పదానికి న్యాయం చేస్తున్నారో వారు గుండెల మీద చేయి వేసుకొని నిస్వార్థంగా చెప్పవచ్చు, వారి సేవలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రజలు గమనించవచ్చు. ప్రపంచంలోనే అనేక దేశాలలో ప్రజాప్రతినిధులు ఎలాంటి గొప్పలకు పోకుండా, సాదాసీదాగా వ్యవహరిస్తూ, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మెజార్టీ ప్రజా ప్రతినిధులు నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేస్తారు. అందుకు భిన్నంగా భారతదేశంలో మాత్రం ప్రతి ప్రజా ప్రతినిధి వెనుక ఒక కులం, ఒక మతం, ఒక ప్రాంతం, ఒక వర్గం అనే ముద్ర వేసుకొని నా వారు, నా మనుషులు, నా కులం, నా మతం అంటూ పేరు చివరన తోకలు తగిలించుకొని రాజకీయాలు చేస్తుంటారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని కుల, మత జాడ్యం ఇండియన్ పొలిటికల్ సిస్టం లోనే ఇమిడి ఉండటం విడ్డూరంగా ఉంది.
ఎన్నికల వరకే పార్టీ లు… గెలిచిన తర్వాత నిష్పక్షపాతంగా ప్రజా సేవ
ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కావాలంటే ఎన్నికలలో పోటీ చేయక తప్పదు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఆయా పార్టీలకు మద్దతునిస్తూ, పార్టీల వారీగా విభజింపబడి, చీలిపోయి, ఎవరి పార్టీ అభ్యర్థికి వారు ఓట్లు వేసుకొని గెలిపిస్తుంటారు. ఎన్నికలలో ఒకసారి గెలిచి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత ఈ భారత ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా ప్రజాప్రతినిధిని గౌరవిస్తారు. ప్రజా ప్రతినిధులు కూడా పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలకు అతీతంగా సమస్యలను పరిష్కరిస్తూ, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ, తమ తమ ప్రాంతాలను అభివృద్ధి పథంలో పయనింప చేస్తుంటారు. అంటే ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు. తర్వాత రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు ప్రజలకు సేవలు అందించాల్సి ఉంటుంది. కానీ నేటి కుట్రా జకీయం స్వార్థపు దారిలో పయనిస్తూ నీది ఆ పార్టీ, నాది ఈ పార్టీ, నీది ఆ ప్రాంతం, నాది ఈ ప్రాంతం, నీది ఆ కులం, నాది ఈ కులం, నీది ఆ మతం, నాది ఈ మతం అంటూ విద్వేషాలను నెత్తికెత్తుకుని ఆరని మంటల జ్వాలలను ప్రజల మధ్యన కులం, మతం, పార్టీల పేరున రగిల్చి ప్రజలు తన్నుకుంటుంటే, కొట్టుకు చస్తుంటే ప్రజా ప్రతినిధులు చోద్యం చూస్తున్నారు తప్పించి వారించిన, నివారించిన పరిస్థితులు చాలా తక్కువ అని చెప్పవచ్చు. పార్టీలకు అతీతంగా ఎలాంటి కులమత వర్గ బేధాలు చూపెట్టకుండా, అందరిని సమాన దృష్టితో చూస్తూ, అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ, అర్హులైన ప్రతివారికి ప్రభుత్వ పథకాలు అందజేస్తూ, అన్ని ప్రాంతాలను అభివృద్ధి దిశలో స్వార్ధ రహితంగా ప్రజా ప్రతినిధులు పనిచేయాల్సిన ప్రజాస్వామ్యం అక్రమాలు, అవకతవకలు, అవినీతి, దాడులు, దౌర్జన్యం, కొట్లాటలు, దొమ్మిలు, బగ్గు మంటున్న రాజకీయ కక్షలు, రావణ కాష్టం లా రగిలే ప్రాంతాలు, అల్లర్లతో అట్టుడికి పోయే కులమత ఘర్షణలు, మోగుతున్న బాంబులు, దూ స్తున్న కత్తులు, దద్దరిల్లుతున్న పరిసరాలు, ఒకరిపై ఒకరు ఆరోపణస్త్రాలు, మత విద్వేషాలు పురి గొలుపుతూ, ఈ విధంగా తాము పబ్బం గడుపుకోవడానికి ప్రజాప్రతినిధులు అనబడే రాజకీయ నాయకులు ప్రజల మధ్యనే చిచ్చులు పెట్టి, ఉచ్చులు బిగించి, ఒకరికొకరు ప్రాణాలు తీసుకునేలాగా ఉసిగొలుపుతూ చోద్యం చూస్తున్నారు తప్పించి, ప్రశాంతమైన పరిపాలన అందించడంలో విఫలమయ్యారనే భావనలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి. అందుకే ప్రపంచంలో ఏ దేశంలో నైనా ఉన్న ఓ ప్రజా ప్రతినిధులారా, ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించండి, ప్రజాస్వామ్యంలో ప్రజల కొరకు పని చేయండి. ఎన్నికల వరకే రాజకీయాలు అన్న సంగతిని గ్రహించండి, వంట పట్టించుకోండి, ప్రజల కొరకు పనిచేసే ప్రజల హృదయాలలో మీ పేరు చిరస్థాయిగా ఉండేలాగా కృషి చేయండి. ప్రజాప్రతినిధి అన్న పదానికి సరైన న్యాయం చేయండి. అందుకు తగ్గట్టుగా హుందాతనంతో వ్యవహరించండి. చిల్లర మల్లర రాజకీయాలకు స్వస్తి పలకండి. ప్రజలందరూ నా వారే అనే ఒక విశ్వభావనకు తెర తీయండి. ప్రజలకు నిస్వార్థంగా సేవలందించి, డబ్బు సంపాదనను తృణప్రాయంగా భావించి ఎంతోమంది మీకంటే ముందు రాజకీయాలలో ఉన్నవారు నేటికీ ప్రజల హృదయాలలో మెలుగుతూనే ఉన్నారు. మీరు కూడా చచ్చినాక ప్రజలు గుర్తుంచుకునే విధంగా నీతి, నైతికత, నిజాయితీలతో సూపర్ పాలకులుగా మారండి. కేవలం ఎన్నికలలో ఖర్చుపెట్టిన డబ్బును తిరిగి సంపాదించడానికి కాకుండా ప్రజల అభిమానాన్ని సంపాదించి ప్రజల చేత గౌరవం పొందే లాగా జీవించండి. ప్రజా ప్రతినిధులు ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, సంక్షేమం అందించాలని, ప్రజాస్వామ్యంలో బాధ్యత గల ఓటర్లైన పౌరులుగా మనమూ కోరుకుందాం.